తాడిపత్రిలో ఆక్టోపస్ బలగాలు

Date:17/09/2018
అనంతపురం ముచ్చట్లు:
తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడలో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా గ్రామస్థులకు, ప్రబోధానంద అనుచరులకు మధ్య చెలరేగిన వివాదం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు చేసుకునే స్థాయికి చేరిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం మొదలైన ఈ వివాదం ఆదివారం నాటికి తీవ్రరూపం దాల్చింది. ఈ దాడుల్లో గాయపడిన ఓ వ్యక్తి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆశ్రమం నుంచి భక్తులను వారి స్వస్థలాలకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పోలీస్ ఉన్నతాధికారులు లోపలికి వెళ్లేందుకు ప్రయతించగా వారిని భక్తులు అడ్డుకున్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ సైతం ఆదివారం సాయంత్రం ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన్ని కూడా రానివ్వలేదు. అంతేకాదు, ఎస్పీ అయితే మాకేంటని ఆయనతో వాదించారు. అందరితో మాట్లాడతామని చెబితే కేవలం ఎస్పీ, ఒక్క గన్‌మెన్‌ను మాత్రమే లోపలికి అనుమతించారు. ఆశ్రమంలోని వారంతా వారి స్వగ్రామాలకు వెళ్లిపోవాలని ఎస్పీ నచ్చజెప్పినా వినలేదు. తాము ఇక్కడే ఉంటామనీ, తమ జీవితం స్వామికి అంకితమని తెగేసి చెప్పేశారు.
సోమవారం ఉదయం నుంచి ఆశ్రమంలో ఉన్న భక్తులను బయటకు తెచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. వీరిని తరలించేందుకు పలు బస్సులను అందుబాటులోకి తెచ్చిన పోలీసులు, ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొనే ప్రత్యేక అక్టోపస్ బలగాలను కూడా రంగంలోకి దించారు. ఆశ్రమంలో ఉన్నవారి వద్ద ఆయుధాలు ఉండొచ్చన్న అనుమానంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో 2,000 మందికిపైగా పోలీసులను మొహరించారు.
అక్టోపస్ బలగాలు కూడా ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. ఏక్షణంలో అయినా ఆపరేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు జేసీ సోదరులు అకారణంగా తమపై కక్ష కట్టారని ఆశ్రమ నిర్వాహకులు పేర్కొంటున్నారు. తొలుత జేసీ వర్గీయులు తమపై దాడిచేసి విధ్వంసం సృష్టించారని ఆరోపిస్తున్నారు. భక్తులను కాపాడటానికే జేసీ వర్గీయులను తాము అడ్డుకున్నామని అంటున్నారు. తమపై అకారణంగా దాడిచేశారని పేర్కొంటున్నారు.
అయితే, తాళం వేసుకుని ఆశ్రమం లోపల ఉండిపోయిన వారిని బయటకు తెచ్చేందుకు అధికారుల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముందుజాగ్రత్తగా సంఖ్యలో అంబులెన్సులను కూడా సిద్ధం చేశారు. ఆపరేషన్ చేపట్టేందుకు అక్టోపస్ టీం కమ్యూనికేషన్, ఇతర వ్యవస్థలను సిద్ధం చేసుకుంటోంది.
Tags:Octopus forces in the hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *