Natyam ad

 పార్టీల మధ్య నలిగిపోతున్న అధికారులు

కరీంనగర్ ముచ్చట్లు:
 
కరీంనగర్‌ జిల్లాలో బీజేపీ రాష్ట్ర చీఫ్‌, ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్ష తలపెట్టడం.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం.. సంజయ్‌ అరెస్ట్‌ చకచకా జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటకొచ్చారు బండి సంజయ్‌. దీక్షకు అనుమతి లేదని బీజేపీ నాయకులకు ముందే చెప్పామన్నది కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ వాదన. అయితే CP కావాలనే దీక్షను అడ్డుకున్నారని ఆరోపిస్తోంది బీజేపీ. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై గతంలో ఉన్న కేసులను తిరగదోడారని కాషాయ పార్టీ మండిపడుతోంది. సీపీ సత్యనారాయణపై పార్లమెంట్ ప్రివిలేజ్‌ కమిటీకి, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు సంజయ్‌.గతంలోనూ సీపీ సత్యనారాయణపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు సంజయ్‌. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్‌ మృతి చెందితే.. అక్కడే ఉన్న తనపై సీపీ జులుం ప్రదర్శించారన్నది బీజేపీ చీఫ్‌ ఆరోపణ. తాజా ఎపిసోడ్‌లో పోలీసుల తీరు మోతాదు మించిందని కమలనాథులు గుర్రుగా ఉన్నారట. పోలీసులు లాఠీచార్జీతోపాటు మహిళా నాయకులు, కేడర్‌పై దాడులు చేశారని ఆరోపిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు.దీక్షను భగ్నం చేసే క్రమంలో పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్‌ తరుణచుగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పినట్టుగా CP ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారాయన. ఈ ఆరోపణలపై స్పందించిన సీపీ సత్యనారాయణ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో దీక్షను భగ్నం చేశామని.. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని తెలిపారు. అయితే సీపీ సత్యనారాయణపై తప్పకుండా చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌, బండి సంజయ్‌ లాంటి నేతలు ప్రకటనలు చేయడం చర్చగా మారింది.
పాలకవర్గం చెప్పినవి పోలీసు అధికారులు తూచా తప్పకుండా పాటించడం.. పైనుంచి వచ్చే ఆదేశాలతో ఎలా చెప్తే అలా వ్యవహరించడం నిత్యం జరిగేదే. అది అన్ని ప్రభుత్వాల్లోనూ ఉంది. కాకపోతే పొలిటికల్‌ పార్టీల మధ్య గొడవలతో పోలీసులు.. ఇతర అధికారులు నలిగిపోతున్నారని.. డిపార్ట్‌మెంట్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే బీజేపీ ఫిర్యాదుల నుంచి సీపీ సత్యనారాయణను టీఆర్ఎస్‌ సర్కార్‌ ఎలా కాపాడుతుందో చూడాలి.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags; Officers torn between parties