ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి

– వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క

గుడ్డును రెండు ముక్కలు చేసి పిల్లలకివ్వండి

విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు, మొదట వార్నింగ్ ఇచ్చి తర్వాత విధుల నుంచి తప్పిస్తాం

 

తెలంగాణ ముచ్చట్లు:

 

అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్డును రెండు ముక్కలు చేసి పిల్లలకివ్వాలని.. అంగన్వాడీల్లో అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేలా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ టీచర్లకు ప్రతి నెలా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఆయాలకు కూడా వర్తింపజేయడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో గురువారం మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు.చిన్నారులకు ఇస్తున్న కోడి గుడ్డును రెండు ముక్కలుగా చేసి ఇస్తే.. చిన్నారులకు తినేందుకు అనువుగా ఉండటంతో పాటు, గుడ్డులో ఏదన్నా నలత వున్నా గుర్తించి పడేయవచ్చని అన్నారు. కోడిగుడ్లను, వస్తువులను భద్రపరచుకునే వ్యవస్థను గత ప్రభుత్వం ఏర్పాటు చేయలే లేకపోయిందని తెలిపారు. ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే పాత్రలను, కోడిగుడ్లను భద్రపరిచే రాక్‌లను త్వరలోనే అందజేస్తామని తెలిపారు. టేక్ హోం రేషన్‌లో భాగంగా ఇస్తున్న వస్తువుల నాణ్యతను లబ్ధిదారుల నుంచి లికిత పూర్వకంగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. ప్రతికూల పరిస్థితులను ప్రాంతాల్లో టేక్ హోం రేషన్‌ను వారింటికి తీసుకువెళ్లి ఇవ్వాలని సూచించారు. తద్వారా ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని అన్నారు.

 

 

ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, మొదట వార్నింగ్ ఇచ్చి తర్వాత విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చూసే బాధ్యత సంబంధిత అధికారులదేనని, ఇక్కడ తప్పు జరిగిన అక్కడి అధికారులపై చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలుంటాయని, సీఎం, మంత్రులు సైతం అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తారని ఆమె స్పష్టం చేశారు.వచ్చే నెల 4 నుంచి జిల్లాల్లో పర్యటించి శాఖా పరంగా అమలవుతున్న పథకాల అమలు తీరు, పనుల పురోగతిని సమీక్షిస్తానని స్పష్టం చేశారు. పూర్వ ప్రాథమిక పాఠాలను బోధించేలా అంగన్వాడీ కేంద్రాలను సమాయత్తం చేయాలని ఆదేశించారు. దేశానికి ఆదర్శంగా మన అంగన్వాడీ పాఠశాలలు ఉండాలని.. ఆ దిశగా టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Tags: Officials must visit Anganwadi centers

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *