ప్రకటనతోనే సరి..

Date:06/12/2018
చిత్తూరు ముచ్చట్లు:
జిల్లాను అనుకున్న గడువులోగా  బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చారు.. నియోజకవర్గాలకు.. మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి శరవేంగా మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించారు.. అనుకున్నట్టే సమష్టిగా శ్రమటోడ్చి మార్చి నెలాఖరుకు జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించేశారు.. అంతేకాదు.. అతి తక్కువ కాలంలో అత్యధిక సంఖ్యలో మరుగుదొడ్లను నిర్మించి జాతీయస్థాయిలో  ప్రథమ స్థానంలో నిలిచారు.. కానీ..ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా తయారయ్యాయి.. జిల్లాలో ఇప్పటికీ  మరుగుదొడ్లు లేని గృహాలు ఉండడం..అర్ధంతరంగా నిర్మాణాలు ఆగడం.. నిర్మించిన వాటిని వినియోగించకపోవడం..వంటివి అధికార యంత్రాంగ వైఫల్యాన్ని, లోపాలను ఎత్తి చూపుతున్నాయి.
జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటిస్తామని సీఎం చంద్రబాబుకు కలెక్టర్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వెంటనే రంగంలోకి దిగారు.జిల్లా యంత్రాంగాన్ని పురమాయించారు.దీంతో అన్ని శాఖల అధికారులు ఆరు నెలల పాటు మిగతా పనులు పక్కనబెట్టారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఓ ఉద్యమంలా నిర్మాణాలు చేపట్టారు.   అనుకున్న గడువులో అధిక మరుగుదొడ్లను నిర్మించాలనే ఆరాటంలో లబ్ధిదారులను పక్కన పెట్టేసి కాంట్రాక్టర్లను రంగంలోకి దింపారు. ఆయా ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యత గుత్తేదారులకు అప్పగించారు. అయితే వారంతా బిల్లుల మంజూరు కోసం తప్పా.. నాణ్యతను పట్టించుకోలేదు. మరికొందరు నిర్మాణాల్ని అసంపూర్తిగా వదిలేశారు. ఈ కారణంగా జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించినా.. ఇంకా గ్రామాల్లో మరుగుదొడ్లు లేని గృహాలు, అసంపూర్తి నిర్మాణాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించుకున్నా.. క్షేత్రస్థాయిలో ఫలితం సంతృప్తికరంగా లేదు.
జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించిన వెంటనే ఓడీఎఫ్‌ ప్లస్‌ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళల సహకారంతో ఆయా ప్రాంతాల ప్రత్యేకాధికారులు మరుగుదొడ్ల వినియోగంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఓడీఎఫ్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టే.. ప్లస్‌ను కూడా విజయవంతం చేయాలని కలెక్టర్‌ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. కానీ.. అధికారులు ఈ విషయమై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. దీంతో గొప్ప ఉద్దేశం కలిగిన కార్యక్రమం చతికిలపడింది. గ్రామాల్లో ఇప్పటికీ 70 శాతం మంది ప్రజలు మరుగదొడ్లను ఉపయోగించడం లేదు. ఏదో అధికారుల బలవంతంతో నిర్మించుకున్నా.. ప్రజలు అవగాహన లోపంతో వాడుకోవడం లేదు.
Tags:OK with the statement ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *