పాత కేసులను తవ్వుతున్నారు

Date:14/09/2018
కర్నూలు ముచ్చట్లు :
నోటీసులకు భయపడే సమస్యే లేదంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. బాబ్లీ కేసులో నోటీసులు, అరెస్ట్ వారెంట్‌ రావడంపై స్పందించారు. ఆనాడు ఉత్తర తెలంగాణ ఎడారవుతుందనే బాబ్లీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశామన్నారు చంద్రబాబు.
ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం కేసును తీసుకొచ్చి.. నోటీసుల పేరుతో ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దేనికి భయపడేది లేదన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్‌తో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు నిరసన తెలియజేయడానికి వెళ్లామన్నారు బాబు. తెలంగాణ బోర్డర్‌లోనే మహారాష్ట్ర పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. తమను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూశారని.. ఏ తప్పు చేయకపోయినా ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారని చెప్పారు.
ఏం చేస్తారో చేయమని ఆనాడే నిర్మోహటంగా చెప్పానని.. కేసులు పెట్టామని.. పెట్టలేదని డ్రామాలాడారని మండిపడ్డారు. తర్వాత అందర్ని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి హైదరాబాద్‌లో వదిలేశారని గుర్తు చేశారు బాబు. ఆ రోజు కూడా తెలుగు జాతికి నష్టం జరుగుతుందనే పోరాటం చేశానన్నారు చంద్రబాబు.
అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాహితం, భవిష్యత్ తరాల కోసం పోరాటాలు చేస్తామని వ్యాఖ్యానించారు. నోటీసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్ పేరుతో హడావిడి చేస్తున్నారని.. తాను ఎక్కడా అన్యాయం చేయలేదని.. నేరాలు, ఘోరాలు చేయలేదన్నారు. ఈ కేసు విషయాన్ని ఆలోచిస్తున్నామని నోటీసుల విషయంలో భయమేమీ లేదన్నారు.
Tags:Older cases are being sacrificed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *