కేరళలో ఓనం వేడుకలు రద్దు

Onam Celebrations in Kerala

Onam Celebrations in Kerala

Date:15/08/2018
త్రివేండ్రం ముచ్చట్లు:
వారం రోజులగా కురుస్తోన్న భారీ వర్షాలకు కేరళ చిగురుటాకులా వణికిపోతుంది. సగం రాష్ట్రం ముంపులో మునిగిపోయింది. వర్షాలకు అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి, ఇల్లు కూలి 40 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకూ కేరళలో 189 మంది మృత్యువాత‌పడ్డారు. దీంతో మళయాలీల కొత్త సంవత్సరం ఓనం ఉత్సవాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఓనం కోసం గతంలో కేటాయించిన రూ.30 కోట్లను ముఖ్యమంత్రి సహాయనిధికి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పంటల పండుగగా ఓనం పండుగ సుప్రసిద్ధమైంది. ప్రతీ ఏడాది ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఓనంను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.30 కోట్లు కేటాయించింది. ‘రాష్ట్రాన్ని గత వారం రోజులుగా వరదలు ముంచెత్తుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.
దీంతో ఈ ఏడాది ఉత్సవాలను నిర్వహించుకోబోవడం లేదని’ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం ఈ నిర్ణయం ప్రకటించారు. ఎన్నడూ లేనివిధంగా 1924 తర్వాత కేరళను అంతటి భారీస్థాయిలో వర్షాలు అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి, వంతెనలు కొట్టుకుపోయాయి. దాదాపు 26 ఏళ్ల తర్వాత ఇడుక్కి డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రకృతి విలయతాండవానికి అల్లాడిపోయిన కేరళను ఆదుకోడానికి కేంద్రంతోసహా పొరుగు రాష్ట్రాలు, సినీ ప్రముఖులు, ఉద్యోగులు, సాధారణ పౌరులు, చిన్నారులు కూడా ముందుకొచ్చారు. టాలీవుడ్ నటుల నుంచి కూడా కేరళ ప్రభుత్వానికి విరాళాలు అందాయి. యువ నటుడు విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు, అల్లు అర్జున్ రూ.25 లక్షలు అందజేశారు.
Tags:Onam Celebrations in Kerala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *