మళ్లీ తెరపైకి ఒకే దేశం ఒకే ఎన్నికలు

Date:18/06/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

నరేంద్రమోడీ, అమిత్ షాల నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం మరోసారి తన రాజకీయ అజెండాను పైకి తీసింది. వివిధ రకాల అంశాలతో ఈనెల పందొమ్మిదో తేదీన ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖయే ఇందుకు పూనుకుంటోంది. అయిదు అంశాల అజెండాలో ఒకే ఒక్క అంశం అత్యంత కీలకమైనది. రాజకీయ ప్రాధాన్యంతో ముడిపడినది. మిగిలిన నాలుగు అంశాలు సాధారణమైన వ్యవహారాలే. జాతీయ స్థాయిలో చర్చ పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సినంతటి వివాదాస్పద విషయాలు కాదు. పార్లమెంటు ఔన్నత్యం పెంచడానికి ఏమేం చర్యలు తీసుకోవాలనేది అజెండాలో మొదటి అంశంగా సూచించారు. నిజానికి కేంద్రప్రభుత్వం ఈదిశలో తనంత తాను చర్యలు తీసుకున్నప్పటికీ ఎవరూ అభ్యంతరం పెట్టరు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం లో నవభారత నిర్మాణం అనేది మరొక అంశం. ఇది పూర్తిగా అకడమిక్ గా కనిపిస్తుంది. అలాగే మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాల నిర్వహణ, చివరిగా వెనకబడిన జిల్లాల అభివృద్ధి . వీటిలోదేనిపైనా పెద్దగా రాజకీయ పార్టీలతో చర్చించాల్సినంతటి తీవ్రత లేదు. కానీ ఒక దేశం, ఒకే ఎన్నిక అన్న అజెండాలోని టాపిక్ మాత్రం రాజకీయ వేడిని రగిలించేదే. 2014 నుంచి ఈ అంశాన్ని కేంద్రం సజీవంగా ఉంచుతూ వస్తోంది. రకరకాల ఆప్షన్లను పార్టీల ముందు పెడుతోంది. మొండిగా ముందుకు వెళ్లడానికి సాహసించలేదు. రాజ్యసభలోనూ భవిష్యత్తులో భారీ ఆధిక్యత సమకూరబోతోంది.

 

 

 

 

 

 

దీనిని ఆసరాగా చేసుకుంటూ రాజ్యాంగ సవరణ చేసైనా ఒక దేశం ఒకే ఎన్నికలు నినాదాన్ని సాకారం చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఒక దేశం, ఒక ఎన్నికలు అన్న నినాదం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిరంతరం దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండటం సాధారణ తంతై పోయింది. దీంతో ఎన్నికల కోడ్ పేరిట పథకాలు నిలిపివేయాల్సి వస్తోంది. కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పైపెచ్చు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు నిరంతరం ఎన్నికలపైనే దృష్టి పెట్టాల్సి వస్తోంది. పరిపాలన కంటే రాజకీయాలకే పెద్ద పీట వేస్తున్నాయి. దీంతో కాలక్రమ పట్టికను అనుసరించి జరగాల్సిన కార్యక్రమాలకు తిలోదకాలివ్వాల్సి వస్తోంది. పార్టీల రాజకీయ వైరుద్ధ్యాలు నిరంతరం కొనసాగుతూ వస్తున్నాయి. పరస్పర సహకారం కొరవడుతోంది. దీనికి విరుగుడుగా దేశంలో లోక్ సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపేస్తే గొడవ వదిలిపోతుంది. తర్వాత పూర్తిగా పరిపాలనపై దృష్టి పెట్టవచ్చనేది కేంద్రం ఆలోచనగా చెబుతున్నారు. కానీ అంతర్గతంగా రాజకీయ ఉద్దేశాలు ఇమిడి ఉన్నాయనేది ప్రతిపక్షాల ఆరోపణ. రాష్ట్రాల ప్రాధాన్యాలు వేరు. జాతీయంగా ఉండే ప్రాధాన్యాలు వేరు. అసెంబ్లీ, లోక్ సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే ప్రాంతీయ పార్టీలకు ఆదరణ తగ్గుతుందనే వాదన ఉంది.

 

 

 

 

 

 

జాతీయ పార్టీలకు ప్రయోజనం అధికంగా ఉంటుందని ప్రాంతీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకే అన్ని పార్టీలను ఒకే ప్లాట్ ఫారం పైకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.దేశంలో ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకున్న తర్వాత నేషనల్ అజెండాకు ప్రాముఖ్యం తగ్గిపోయింది. ప్రాంతీయ ఆకాంక్షలు, అస్తిత్వాలు పెరిగిపోయాయి. కొన్ని పార్టీలైతే రాష్ట్రానికి ఒక ప్రత్యేక జెండా కూడా రూపొందించుకుంటామనే స్థాయికి వెళ్లిపోయాయి. తమిళనాడు వంటి రాష్ట్రాలు జాతీయ భాష హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రాంతీయత్వం బాగా పెరిగిపోవడం జాతీయ సమగ్రతకే భంగకరమని బీజేపీ భావిస్తోంది. గడచిన మూడు దశాబ్దాలుగా ఏ జాతీయ పార్టీకి లేనంత బలం బీజేపీకి ఇప్పుడు లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ మొత్తం భారత దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిపేస్తే రాజకీయ స్థిరత్వాన్ని సాధించవచ్చని కమలనాథుల అంచనా. దానివల్ల కశ్మీర్ వంటి వివాదాస్పద అంశాల్లో దృఢమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్టికల్ 370 రద్దు వంటి విషయాల్లోనూ జాతీయ వైఖరికి మద్దతు ఒకేసారి కూడగట్టవచ్చు. ప్రాంతీయ పార్టీల డిమాండ్లు, వాటి లోకల్ అజెండాను పక్కనపెట్టేయవచ్చనేది బీజేపీ యోచన.

 

 

 

అయితే లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిపితే ప్రాంతీయపార్టీలు నష్టపోతాయని ఆయా పార్టీల అధినేతలు విమర్శిస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ లోక్ సభ ఎన్నికల విషయానికొచ్చేసరికి జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెసు పుంజుకున్నాయి.దేశంలో ప్రతి ఆరునెలలకు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి. దీనివల్ల కేంద్రంలోఅధికారంలో ఉన్న పార్టీ పూర్తిగా ఆ రాష్ట్రంపై ద్రుష్టి పెట్టాల్సి వస్తోంది. పైపెచ్చు కోడ్ పేరుతో అనేక పథకాలు పెండింగులో పడుతున్నాయి. అభివ్రుద్ధి కుంటుపడుతోంది. ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో విభేదాలను రెచ్చగొడుతున్నాయి. జాతీయంగా అవే పెద్ద సమస్యలుగా రూపుదాలుస్తున్నాయి. అదే దేశవ్యాప్త ఎన్నికలు జరిగితే అంత పెద్ద ఎత్తున చర్చకు తావుండదు. జాతీయవాదం, దేశ రక్షణ వంటి అజెండాను భుజానకెత్తుకునే బీజేపీ వంటి పార్టీలకు గరిష్ఠంగా లబ్ధి సమకూరుతుంది. కానీ ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో ఒకేసారి దేశవ్యాప్త ఎన్నికలంటే ప్రాంతీయ పార్టీలు అంగీకరించకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలవ్యవధిని కుదించాల్సి వస్తుంది.

 

 

 

 

 

 

కొన్నిచోట్ల పెంచాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం రాజ్యాంగబద్ధం కావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. సగం పైగా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాల్సి ఉంటుంది. అయితే కేంద్రంలోని బీజేపీకి ప్రస్తుతం ఈరకమైన సవరణ చేసేందుకు అవసరమైన చట్టసభల బలం లభించింది. సగానికిపైగా రాష్ట్రాల్లో బీజేపీ, మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి. లోక్సభ, రాజ్యసభల్లోనూ మెజార్టీ మార్కు ఎన్డీఏదే. అందువల్ల రానున్న రెండేళ్ల పాటు చర్చలు, సంప్రతింపుల పేరిట తతంగం నడిపి 2024 నాటికి ఒకే దేశం, ఒకే ఎన్నిక కు బీజేపీ ప్రయత్నిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లేదంటే దేశంలోసగం అసెంబ్లీలకు ఒకసారి మిగిలిన అసెంబ్లీలకు లోక్ సభతో కలిపి నిర్వహించే అవకాశం కూడా ఉందంటున్నారు.

జేసీ మాటల్లో ఆంతర్యం ఏమిటీ

Tags: Once again, the same country is the same election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *