ఒక్కసారి  అవకాశం ఇస్తే…

హైదరాబాద్ ముచ్చట్లు:

 


రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత వేస్తున్న అడుగులు ఆయన పదవిలో పాతుకుపోవడానికే ఎక్కువగా శ్రమిస్తున్నట్లు అర్థమవుతుంది. ఒక్కసారి అవకాశమిస్తే చాలు.. రేవంత్ మరొకరికి అవకాశం ఇవ్వడన్న పేరుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం ఐదు రోజులే అవుతున్నా ఎంతో మెచ్యూరిటీని ఆయన ప్రదర్శిస్తూ పలువురి మన్ననలను పొందుతున్నారు. ముఖ్యంగా సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలుత ప్రగతి భవన్ జ్యోతిరావు పూలే భవన్ గా మార్చి అందులో ప్రజా దర్బార్ ను నిర్వహించారు. ఉదయం పది గంటల సమయం నుంచి ఓపిగ్గా ప్రజలతో మమేకమై వారి నుంచి వినతులను స్వీకరించారు. అంతకు ముందే సచివాలయంలో ఆయన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని కీలక శాఖలపై సమీక్ష నిర్ణయించారు. ముఖ్యంగా విద్యుత్తు శాఖలో జరిగిన ఒప్పందాలు, కోట్లాది రూపాయలు ఖర్చు అయిన వైనంపై ఆయన విచారణకు కూడా ఆదేశించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించారు. విద్యుత్తు ఒప్పందాలలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఎన్నికల సందర్భంగా ఆరోపించిన నేపథ్యంలో ఈ దిశగా ఆయన చర్యలకు ఉపక్రమించినట్లయింది.

 

అంతేకాకుండా వివిధ శాఖలపై జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా శ్వేత పత్రాలను విడుదల చేయడానికి రేవంత్ టీం సిద్ధమవుతుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుజారి పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన వద్దకు వెళ్లి పరామర్శించి రేవంత్ మరికొంచెం రాజకీయ పరిణితిని ప్రదర్శించారు. రాజకీయాల్లో విధానాలు వైరుధ్యం తప్ప వ్యక్తిగత ద్వేషాలకు తాను ఇవ్వనన్న సంకేతాలను బలంగా బయటకు పంపాడు. పార్టీ కిందిస్థాయి క్యాడర్ కు కూడా అదే సిగ్నల్స్ పంపి గ్రామాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడగలిగారు. ఇక ప్రజావాణి కార్యక్రమాన్ని పునరుద్ధరించి ప్రజాసమస్యలను పరిష్కరించడానికి కూడా రేవంత్ ప్రభుత్వం సిద్ధమయింది. ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే ముఖ్యమైన రెండు గ్యారంటీలను అమలు చేసి కొంత ప్రజల్లో నమ్మకాన్ని తెచ్చుకోగలిగింది.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో రానున్న కాలంలో కాంగ్రెస్ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలు, మ్యానిఫేస్టోలో పేర్కొన్న అంశాలు గ్రౌండ్ చేస్తారన్న అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతుంది. పాజిటివ్ వేవ్ తో రేవంత్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని భావిస్తున్నట్లుంది. అయితే కేవలం ఐదు రోజుల్లో అంచనా వేయడం సరైన పద్ధతి కాకపోయినా.. వేస్తున్న అడుగులు మాత్రం తాను పదవిలో పాతుకుపోవడానికే నిర్ణయించుకున్నారన్నది మాత్రం సుస్పష్టం. కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు ఇటు పార్టీ నేతలు, క్యాడర్ కు కూడా ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ముందుకు వెళ్లాలన్నది రేవంత్ ఆలోచనగా ఉన్నట్లు అర్థమవుతుంది. చూద్దాం.. రానున్న కాలంలో రేవంత్ వేసే అడుగులు.. మరెన్ని సంచలనాలను నమోదు చేస్తాయో.

Tags: Once given a chance…

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *