ఏక ధాటిగా వానలు..పంటలు 

Date:19/07/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల నుంచి విస్తారంగా వర్షాలు కురస్తున్నాయి. సీజన్‌లో పంటలు వేసేందుకు అదును దాటిపోతుండటంతో మరోసారి దెబ్బతింటామని రైతులంతా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వరుణుడు కరుణించడంతో సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు అన్ని పంటలకు ప్రయోజనం చేకూరనుండగా, ఖరీఫ్ సాగు విస్తరించేందుకు దోహదపడింది. ఇప్పటివరకు కేవలం జిల్లా సాధారణ సాగులో 25 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. వర్షాలతో 60 శాతం వరకు రైతులు సాగు చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. వర్షాలు ఇదే విధంగా కురిస్తే ఖరీఫ్ సాగు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. పత్తి పంట అనూహ్యంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.  ఏకధాటిగా కురిసిన వర్షంతో చాలా మండలాల్లోని చెరువులు, కుంటల్లోకి నీరు చేరుకుంటోంది. వాగులు, వంకలు వర్షాలతో జలకళ సంతరించుకుంటున్నాయి. వర్షాలు ఇంకో రెండు, మూడు రోజులు ఇదే రీతిన కురిస్తే భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా పెరిగే అవకాశం ఉంటుంది. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు జిల్లాలో విస్తారంగా వర్షం కురిసింది. ముసురు పట్టినట్లు ఏకధాటిగా వర్షం కురవడంతో జన జీవనం స్తంభించిపోయింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుని వర్షాలు మరింత కురిసే అవకాశం ఉండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆయా పంటల విత్తనాల కోసం రైతులు పరుగులు పెడుతున్నారు.జూన్ మొదటి వారంలోనే తొలకరి వర్షాలు పలుకరించాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. ఈ తరుణంలో దాదాపు 20 రోజుల వరకు వేసవిని తలపించేలా ఎండలు మండిపోయాయి. దీంతో ఖరీఫ్ సాగుపై రైతులు డోలాయమానంలో పడ్డారు. సాగుపై ఆశలు వదులుకునే పరిస్థితి వస్తాయోమోనని ఆందోళన చెందుతున్న రైతులకు ప్రస్తుతం కురిసిన వర్షంతో పాటు భారీ వర్షాలకు అవకాశం ఉండేలా వాతావరణంలో ఏర్పడిన మార్పులు కూడా ఆశలు కల్పిస్తున్నాయి. దీంతో అన్నదాతలు అధికంగా ఉండే పల్లెల్లో సందడి నెలకొంది. వారం రోజుల నుంచి విస్తారంగా వానలు పడటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వానలు కురుస్తుండటం వల్ల ఎరువులు, విత్తనాల అవసరాలు కూడా పెరిగాయి. పత్తి, వరి, పెసర, మినుము, కంది పంటలకు వర్షాలు జీవం పోశాయని రైతులు అంటున్నారు. ఇప్పటికే వరి నారుమళ్లు పోసిన రైతులు ఈ వర్షంతో ఆనందంలో ఉన్నారు.ఆకాశం మేఘావృతమై వర్షాలు పడుతుండటం, మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఎగబడుతున్నారు. దుమ్ముగూడెం మండలంలో ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు రైతులకు సరిపడా రాకపోవడంతో జోరువానలో కూడా రైతులు విత్తనాల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి చాలాచోట్ల ఉన్నా వ్యవసాయాధికారులు ఈ సమస్యను చక్కదిద్దే పని చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా ఉన్న మండలాల్లో రైతులు వ్యవసాయ శాఖ, సొసైటీ కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తుండగా, అవి అందని రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తున్నారు.
ఏక ధాటిగా వానలు..పంటలుhttps://www.telugumuchatlu.com/one-by-one/
Tags: One by one ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *