నెల్లూరులో మూత పడనున్న వంద స్కూళ్లు

One hundred schools to be covered in Nellore
Date:14/07/2018
నెల్లూరు ముచ్చట్లు:
ఉపాధ్యాయుల బదిలీలకు రేషనలైజేషన్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. రేషనలైజేషన్, వెబ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టిన విషయం విదితమే. ప్రభుత్వం తాత్సారం చేయడంతో నెల రోజులపాటు గందరగోళం నెలకొంది. బదిలీలకు సంబంధించిన జీఓలో సవరణలు చేయగా.. ఉపాధ్యాయులు మెట్టు దిగకపోవడంతో పాయింట్లు, ఇతర నిబంధనల మార్పు, పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అంగీకరించిన ప్రభుత్వం తాజాగా రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించి కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ జిల్లా విద్యాశాఖ అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే పూర్తిచేసిన రేషనలైజేషన్ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. పాఠశాలలు ప్రారంభించి నెల రోజులు కావస్తోంది. రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టి తగినంత మంది విద్యార్థులు లేని పాఠశాలల్ని మూసివేయడం, వారిని సమీపంలోని పాఠశాలలో విలీనం చేయడం కష్టతరం కానుంది. ఇదిలావుంటే.. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాయింట్లపై కుస్తీ పడుతూ విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఫలితంగా విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. తాజా షెడ్యూల్ విడుదలతో మరో నెల రోజులపాటు బోధన మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు చదువులో రెండు నెలలపాటు వెనుకబడే దుస్థితి నెలకొంది. కార్పొరేట్ పాఠశాలల్లో తొలి విడత సిలబస్ పూర్తిచేసి ఫార్మెటివ్ పరీక్షలకు సిద్ధమవుతుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. తాజా నిర్ణయం వల్ల ఈ కార్యక్రమం మొదటికొచ్చింది. ప్రస్తుత అంచనాల ప్రకారం 63 ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా మూతపడనున్నాయి. వీటితోపాటు 100 ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తారు. ఉన్నత పాఠశాలల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అధికారులు చెబుతున్నారు.
నెల్లూరులో మూత పడనున్న వంద స్కూళ్లు https://www.telugumuchatlu.com/one-hundred-schools-to-be-covered-in-nellore/
Tags:One hundred schools to be covered in Nellore