ఒక్క విద్యార్ధి టీసీ…

విశాఖపట్టణం ముచ్చట్లు:

వంద మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో చూశాం. కానీ, ఒక్కడే విద్యార్థికి ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూడటం చాలా అరుదు. అనకాపల్లి జిల్లాలోని చోడవరం మండలం రేవళ్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలది ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇక్కడ చదువుతున్న ఒకే ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం ఒక ఉపాధ్యాయుడిని నియమించింది. ఆయనే ఇక్కడ ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు కూడా. ఇన్నాళ్లూ ఒకే ఒక్క విద్యార్థికి పాఠాలు చెబుతున్న ఈ టీచర్‌కు ఇప్పుడిక ఆ అవసరం కూడా లేకుండా పోతోంది. ఎందుకంటే, ఆ ఒక్క విద్యార్థి కూడా ఈ పాఠశాల నుంచి టీసీ తీసుకొని వెళ్లిపోతున్నాడు.రేవళ్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు పాఠాలు బోధిస్తారు. అయితే, ఈ పాఠశాలకు విద్యార్థులు కరువయ్యారు. స్టూడెంట్స్ లేక 2018లో ఈ పాఠశాలను మూసివేశారు. దీంతో ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై వేరే గ్రామంలోని స్కూలుకి పంపారు.కరోనా పరిస్థితుల తర్వాత 2020లో ఈ పాఠశాల తిరిగి తెరుచుకుంది.

 

 

బతుకు దెరువు కోసం ఈ గ్రామం నుంచి పట్నాలకు వెళ్లిపోయిన వారంతా కోవిడ్ సమయంలో తిరిగి వచ్చేశారు. తమ పిల్లలను ఈ పాఠశాలను చేర్పించారు. 2020-21 విద్యా సంవత్సరంలో 15 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు. ఇక 2021-22 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 17కు పెరిగింది. ఈ 17 మందిలో ఈ ఏడాది ముగ్గురు విద్యార్థులు ఆరో తరగతిలో చేరేందుకు వేరే పాఠశాలకు వెళ్లారు. మరో 13 మంది విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల్లో వేర్వేరు స్కూళ్లకు మారిపోయారు. ఇప్పుడీ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థి ఎడ్ల మోహిత్ సూర్య ఒక్కడే మిగిలాడు. అతడికి ప్రధానోపాధ్యాయుడు ఎస్.వి.ఎస్. మూర్తి పాఠాలు బోధిస్తున్నారు.బాలుడు మోహిత్ సూర్య తండ్రి ఉద్యోగ రీత్యా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉంటున్నారు. సూర్య ఇన్ని రోజులూ తన తల్లితో కలిసి రేవళ్ల గ్రామంలో ఉంటున్నాడు. ఇప్పుడు తన తల్లితో కలిసి తండ్రి వద్దకు వెళ్లిపోతున్నాడు. దీంతో పాఠశాల మొత్తం ఖాళీ అవుతోంది. ప్రధానోపాధ్యాయుడు మూర్తి మాత్రమే మిగిలిపోయారు!

 

Tags: One Student Touch…

Leave A Reply

Your email address will not be published.