సీనియర్లపై కొనసాగుతున్న రాహుల్ అలక

Ongoing Rahul Alaka on Seniors

Ongoing Rahul Alaka on Seniors

Date:01/07/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

రాహుల్ గాంధీ ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నాడు. అధ్యక్షపదవి పేరు చెబితే ససేమిరా అంటున్నాడు. అఖిల భారత పార్టీ అధ్యక్షునిగా ఇది తొలిసార్వత్రిక పరాజయమే. 2014 ఎన్నికలనాటికి సోనియానే అధ్యక్షురాలు. 2019 మాత్రమే ఆయన కాతాకు చెందుతుంది. మొదటి ఓటమికే బెంబేలెత్తితే భవిష్యత్తు ఏమిటి? నిజానికి రాజకీయం పూల పాన్పు కాదు. ముళ్ల కిరీటమే. కానీ పార్టీలో పునరుత్తేజం నింపలేకపోతున్నాననే ఆందోళనతోనే రాహుల్ గాంధీ ఈ బాధ్యత వద్దనుకుంటున్నట్లుగా సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెసును నైతికంగా దెబ్బతీసే క్రమంలో భాగంగా ప్రధాని మోడీ రాహుల్ ను వారసుడు, యువరాజంటూ ఎద్దేవా చేస్తున్నారు. సహజంగానే రాహుల్ కు అటువంటి కీర్తికిరీటాలపై పెద్దగా మోజు లేదు. అయినప్పటికీ ఆరోపణలు, విమర్శలు మోయాల్సి వస్తుందనే ఆవేదనకు గురవుతున్నట్లుగా ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. వారసునిగా తనకు కాకుండా కొత్తవారికి అవకాశమిచ్చి చూస్తే పార్టీపై ఆనువంశిక ముద్ర పోతుందేమోననే యోచనతోనే భీష్మించుకుని కూర్చున్నట్టుగా చెబుతున్నారు.కాంగ్రెసు పార్టీ అతి క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. వరసగా రెండోసారి ప్రతిపక్ష హోదాకు తగిన సంఖ్యలో లోక్ సభలో స్థానాలు తెచ్చుకోలేకపోయింది. పార్టీని ఒకవైపు సీనియర్లు పట్టుకుని వేలాడుతున్నారు. పెద్ద పదవులు నిర్వహించి గతంలో ప్రభుత్వ హోదాలు అనుభవించినవారు పార్టీ కోసం త్యాగం చేసేందుకు సిద్ధం కావడం లేదు. తమతోపాటు తమ బంధుమిత్రులు వారసుల కోసం తాపత్రయపడుతున్నారు.

 

 

 

 

 

 

ఫలితంగా కొత్త రక్తాన్ని ఎక్కించడం సాధ్యం కావడంలేదు. వారిని పూర్తిగా దూరంగా పెడదామంటే ఇప్పటికే దెబ్బతిని ఉన్న పార్టీపై దుష్ప్రచారం పెరిగిపోతుంది. అందుకు సోనియా ఇష్టపడటం లేదు. స్వచ్ఛందంగా వారు ఇతర పార్టీలకు వెళ్లి ఆశ్రయం పొందితే అభ్యంతరం లేదనే సంకేతాలను పలుమార్లు రాహుల్ గాంధీ ఇచ్చి చూశారు. కానీ అవినీతి విషయాల్లో వారికున్న ట్రాక్ రికార్డు ద్రుష్ట్యా బీజేపీ వంటి పార్టీలు కాంగ్రెసు వారికి పెద్దగా అవకాశం ఇవ్వడం లేదు. దీంతో పార్టీకి భారమైనప్పటికీ కాంగ్రెసు అభయహస్తం నీడలోనే సేదతీరుతున్నారు.కాంగ్రెసు పార్టీలో రాహుల్ గాంధీ అయిదో తరం వారసుడు. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూలు స్వాతంత్ర్యానికి ముందుతరంలో పార్టీకి నాయకత్వం వహించారు. ఇందిర కాలంనుంచే వారసత్వం స్థిరపడిందని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ఒరిజినల్ కాంగ్రెసు స్థానంలో తనదైన ఇందిరాకాంగ్రెసును ఆమె నిర్మించుకున్నారు. సీనియర్ నాయకుల సిండికేట్ నుంచి , తిరుగుబాట్ల నుంచి , బహిష్కరణల నుంచి అనేక పాఠాలు ఇందిర నేర్చుకున్నారు. స్వయంగా కాంగ్రెసులో ఆమె ఎదుర్కున్న సవాళ్లు అన్నీ ఇన్నీ కాదు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా క్లిష్టసమయంలో బాధ్యతలు చేపట్టారు. పార్టీ తిరిగి కోలుకోవడం కష్టమనే సమయంలోనే సోనియా అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకున్నారు. బీజేపీ హయాంలో ఆరేళ్లపాటు ఆమె పార్టీని భుజస్కంధాలపై మోస్తూ 2004లో అధికారానికి తెచ్చారు. సోనియాకు, రాజీవ్ కు సైతం అధ్యక్షపదవి విషయంలో కొంత పోటీ ఎదురైంది. నిజానికి రాహుల్ కు ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ పరాజయం ఎదురవుతున్నప్పటికీ పార్టీ పీఠం విషయంలో అతడిని సవాల్ చేసేవారు లేరు. కానీ పోరాట పటిమ విషయంలో ఇందిర, సోనియా చూపిన తెగువను చూపలేకపోతున్నారు.

 

 

 

ఫలితంగా పలాయన మంత్రం పఠిస్తున్నారనేది పరిశీలకుల అంచనా.ఎంతగా పోరాడినా కాంగ్రెసు పార్టీ పునరుజ్జీవం పొందలేకపోతోంది. కాంగ్రెసు సిద్దాంతాలకు కాలం చెల్లిందా? కాలానుగుణంగా పార్టీ తనను తాను పునర్నిర్వచించుకోవడంలో వైఫల్యం చెందిందా? కొన్ని రాష్ట్రాల్లో నెగ్గిన ఏడాది తిరగకుండానే లోక్ సభ ఎన్నికలో పార్టీకి ఓటమి ఎందుకు ఎదురవుతోంది? అన్నీ ప్రశ్నలే. సమాధానాలు దొరికినప్పుడే బీజేపీకి దీటుగా కాంగ్రెసు నిలవగలుగుతుంది. మైనారిటీలను సంత్రుప్తి పరిచే విధానాలను దీర్ఘకాలం అనుసరించడంతో ప్రతికూలంగా మెజారిటీ హిందూ పోలరైజేషన్ కు ఆస్కారం ఏర్పడింది. ఎస్సీ,ఎస్టీ వర్గాలను అక్కున చేర్చుకుని గరీబీ హఠావో వంటి నినాదాలతో కాంగ్రెసుకు ఆయావర్గాలను అనుసంధానం చేశారు ఇందిర. విద్యా,సామాజిక పరంగా చైతన్యవంతమైన ఆయా వర్గాలు పేదరికం స్థానంలో ఆత్మగౌరవం, రాజ్యాధికారం అంటూ ఇతర పార్టీలను ఆశ్రయించడం ప్రారంభించాయి. మధ్యతరగతి, విద్యావర్గాల్లో మతపరమైన భావనలు బలపడ్డాయి. దీంతో లౌకిక వాదన అంటూ రొట్టకొట్టుడుగా చెప్పే కాంగ్రెసు సిద్దాంతం వారికి ఆకర్షణీయంగా కనిపించడం లేదు. ఆయా లోపాలను సవరించుకుంటూ దూకుడు అలవరచుకుంటేనే కాంగ్రెసుకు భవిష్యత్తు ఉంటుంది. నాయకత్వం ఎవరు వహిస్తున్నారనేది చాలా ముఖ్యం. నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరే వారు ఈ స్థానంలో ప్రస్తుత పరిస్థితిలో కూర్చుంటే పార్టీ మరింత బలహీనపడటం ఖాయం. దేశానికి జాతీయంగా ఒక ప్రతిపక్షం తప్పనిసరి. అందువల్ల ఆ బాధ్యత నుంచి రాహుల్ గాంధీ తప్పించుకోలేరు.

జగన్ ను పట్టించుకోని టాలీవుడ్

Tags: Ongoing Rahul Alaka on Seniors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *