ఆన్‌లైన్‌ అవస్థ

Online Depression

Online Depression

Date:17/07/2018
నిజామాబాద్‌ముచ్చట్లు:
సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాల్లో చేరాలనుకునే అనాథలకు సమస్యలు ఎదురవుతున్నట్లు నిజామాబాద్ జిల్లాలో విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో ధృవ పత్రాలు లేవంటూ పలువురు విద్యార్ధులను హాస్టళ్ల నిర్వాహకులు చేర్చుకోవడంలేదని విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. ఆన్‌లైన్‌ లింకు పేరుతో విద్యార్థులను ఇబ్బందిపెడుతున్నారని ఏఒక్కటి లేకపోయినా విద్యార్థులను తిప్పి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. దీంతో అనాథలు, పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఏమిచేయాలో తెలియక సతమతమవుతున్నారని అంటున్నాయి. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చేరాలంటే విద్యార్థికి ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, కులం, ఆదాయ ధృవీకరణ పత్రం, బోనాఫైడ్‌, ఒక కలర్‌ ఫోటో తప్పనిసరిగా ఉండాలి. ఈ ధ్రువపత్రాలను వసతి గృహం వార్డెన్‌లు తీసుకొని వీటిని స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి విద్యార్థిని వసతి గృహంలో చేర్చుకుంటారు. ఈ ధ్రువపత్రాల్లో ఏఒకటి తక్కువైనా ఆన్‌లైన్‌ చేయడానికి కుదరదు. ఆన్‌లైన్‌ కాని విద్యార్థులను వసతిగృహంలోకి తీసుకునేందుకు వీలు లేదు. ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేసేందుకు వార్డెన్‌లకు ఎలాంటి పరికరాలు లేవు. వారు ఈ ధ్రువపత్రాలు పట్టుకొని ఇంటర్‌నెట్‌ సెంటర్ల చుట్టూ తిరగాల్సి ఉండడం కూడా సమస్యాత్మకంగా మారింది.నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సాంఘిక సంక్షేమ వసతిగృహంలో 100 మంది అనాథ విద్యార్థులను చేర్చుకోవాలి. ఈ విద్యార్థులకు అయినవాళ్లెవరూ లేరు. వీరికి ప్రభుత్వం సూచిస్తున్న ధ్రువపత్రాలు ఉండే పరిస్థితి లేదు. ఇక ఇతర వసతిగృహాల పరిస్థితి చూస్తే పాత రేషన్‌కార్డులు పూర్తిగా తొలగించారు. కొత్తవి ఇప్పటి వరకు ఇవ్వలేదు. గతంలో సంవత్సరాల క్రితం ఇచ్చిన రేషన్‌ కార్డుల్లో విద్యార్థుల పేర్లు లేవు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ధ్రువపత్రాలు తీసుకునే పరిస్థితిలో లేరు. ఇదంతా సమస్యలు తావిస్తోంది. ఇక కొందరు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి బతుకుతెరువు కోసం వచ్చిన వారికి ఆధార్‌ తప్ప ఇతర పత్రాలు ఏమీ లేవు. దీంతో నిజామాబాద్ లోనే కాక కామారెడ్డి జిల్లాలోనూ ఉన్న వసతి గృహాలకు వందల మంది విద్యార్థులు వెళ్లి సరైన ధ్రువపత్రాలు లేక నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఈ పరిస్థితిపై సత్వరమే స్పందించి సంబంధిత అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు నేతలు కోరుతున్నారు. అర్హులైన విద్యార్ధులందరికీ వసతిగృహాల్లో చోటు కల్పించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
ఆన్‌లైన్‌ అవస్థhttps://www.telugumuchatlu.com/online-depression/
Tags: Online Depression

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *