సిరిసిల్లకు బతుకమ్మ చీరల ఆర్డర్

Date:14/04/2018
రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:
ప్రకృతి వేడుక బతుకమ్మ పండుగ. మహిళలు, ఆడపిల్లలకు ప్రత్యేకమైన ఈ పర్వదినం నిర్వహణను తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకే ఏటా ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పాటూ మహిళలకు చీర అందించే సంప్రదాయం ప్రారంభించింది. గతేడాదిలో రాష్ట్రంలోని అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు అందించింది ప్రభుత్వం. అయితే ఈ చీరలపై పలువురు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ దఫా అలాంటి వ్యతిరేకతకు ఛాన్స్ లేకుండా స్థానికంగా చీరలు తయారు చేయిస్తోంది సర్కార్. ఈ మేరకు చీరల తయారీ ఆర్డర్‌ సిరిసిల్ల జిల్లాకు దక్కింది. జిల్లాలోని కార్మికక్షేత్రంలో కార్మికులకు చేతినిండా ఏడాది పాటు పని కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా 95 లక్షల చీరలు అవసరం. దీంతో రూ.247 కోట్ల విలువైన చీరలను తయారు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇదిలా ఉంటే చీరల పేరుతో దాదాపు 7కోట్ల మీటర్ల వస్త్రం తయారు చేయాలి నేతన్నలు. జిల్లాలోని 25 వేల మరమగ్గాలు 5 నెలల పాటు ప్రతిరోజు పనిచేస్తేనే టార్గెట్ చేరుకోగలమని అధికారులు అంటున్నారు. ఈ దఫా వేడుకలకు మూడు రకాల చీరలను తయారు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు సైతం ముడిసరకు అందుబాటులోకి వచ్చింది. చీరల్లో జరీ, ప్రింటింగ్‌ ఉండటంతో ధర రూ.260 పడుతుందని అంచనా. ప్రస్తుతానికి 20 లక్షల చీరల ఆర్డర్‌ మాత్రమే సిరిసిల్ల అందుకుంది. పూర్తిస్థాయిలో ఆర్డర్ వస్తే తయారీ ప్రారంభించేస్తామని తయారీదారులు స్పష్టంచేస్తున్నారు. సాంకేతికంగా మరమగ్గాలను చీరల జరీకి అనుగుణంగా ఆధునికీకరించుకోవాలి. ఈ పని చేయడానికి అదనంగా భారం పడుతుంది. దీంతో పూర్తి స్థాయిలో ఆర్డర్‌ వస్తేనే గిట్టుబాటు అవుతుందని ఉత్పత్తిదారులు అంటున్నారు. అందుకే పూర్తిస్థాయి ఆర్డర్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వెంటనే మిగతా ఆర్డర్‌ ఇచ్చినట్లయితే తయారీ ప్రారంభమై అనుకున్న సమయానికి కార్మికులు బతుకమ్మ చీరలను అందించే అవకాశాలున్నాయి. బతుకమ్మ చీరల తయారీ వల్ల ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉపాధి దొరకనుంది. అంతేకాక ప్రత్యక్షంగా పరోక్షంగా పట్టణ వ్యాపారాల్లో కొంత ఊరట కలుగుతుంది. గతేడాదిలా కాక స్థానికంగానే ప్రభుత్వం చీరలు తయారు చేయిస్తుండడంతో మహిళల్లో ఆసక్తి నెలకొంది. చీరల తయారీ పుణ్యమాని ఉపాధి దొరకడంతో నేత కార్మికుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది.
Tags:Order of Butkamma Sari for Cyrillic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *