Natyam ad

సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరం..

తిరుమల ముచ్చట్లు:
అఖిలాండకోటికి బ్రహ్మాండ నాయకుడైన ఏడుకొండలస్వామి దర్శనం కోసం ఎన్ని ప్రయాసలు ఎదురైనా ఆనందంగా భరిస్తారు భక్తులు. వారికి కావల్సిందల్లా.. శ్రీవారి దర్శనమే. అందుకే సామాన్య భక్తులకు ఎలాంటి ప్రణాళికలు.. సిఫారసులు ఉండవు. తమను గట్టెక్కించే స్వామివారు గుర్తుకొస్తే చాలు తిరుమల వచ్చేస్తారు. స్వామివారిని దర్శించుకుని.. ఆ సమయంలో కలిగే దివ్యానిభూతితో తిరుగు ప్రయాణం అవుతారు భక్తులు. కానీ.. ఏడాదిన్నర కాలంగా సామాన్య భక్తులకు శ్రీవారు దూరం. ఈ మాట అనేకంటే టీటీడీ నే అంచెలంచెలుగా దూరం చేస్తోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల్లో 60-70 శాతం సామాన్యులే. కోవిడ్ ఆంక్షల పేరుతో కనీసం ఆరు శాతం సామాన్యులు కూడా శ్రీవారిని దర్శించుకోవడం లేదుకోవిడ్ మొదలైనప్పటి నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాల నియంత్రణ కొనసాగుతోంది. ఈ ఆంక్షలు కూడా ఒకవైపే అన్నట్టుగా మారిపోయింది. ప్రస్తూతం 30-40 వేలమంది భక్తులను దర్శనానికి అనుమతిస్తూన్నా.. అవన్నీ ఆన్‌లైన్‌లో కేటాయిస్తున్నవే. సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నా.. సామాన్యులకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సంపన్నులుతో పోటి పడి దర్శనం టికెట్లు పొందే సామర్థ్యం సామాన్యులకు లేదనే వాదన ఉంది. ఆఫ్‌లైన్‌లో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలి అంటే మాత్రం కోవిడ్‌ అడ్డొస్తోంది. కరోనా ఆంక్షలు పాటించాల్సి ఉన్నా.. వాటిని సామాన్య భక్తులకే వర్తింప చేయడంపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తిరుమలలో రోజూ సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాలను… ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్నారు. వాటిపై నియంత్రణ లేదు. ఆ టికెట్ల సంఖ్య తగ్గించలేదు. పైపెచ్చు వాటి సంఖ్య పెరిగిందనే చెప్పాలి.
 
 
 
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లో కేటాయిస్తున్నా.. గతంతో పోల్చితే వీటి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకి 18-20 వేల టికెట్లు జారీ చేయగా..ప్రస్తుతం 20-25 వేల వరకూ ఉంటోంది. వర్చువల్ సేవా టికెట్లు, సుపథం టికెట్లు.. ఇలా ఎక్కడా ఆ వర్గాలకు కోత లేదు. సమస్యంతా సామాన్య భక్తులదే అన్నట్టుగా వారి సంఖ్యని టీటీడీ పూర్తిగా కట్టడి చేసింది. గతంలో రోజుకి 30-50 వేలమంది సామన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ప్రస్తుతం సామాన్యులకు ఇస్తున్న టోకెన్లు పదివేలే. అదీ ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది.భక్తులకు తిరుపతిలో దర్శనం టోకెన్లు జారీ చేస్తే.. వాటిని పొందే క్రమంలో కోవిడ్ వ్యాప్తి చెందుతుందని టీటీడీ హడలిపోతోంది. అయితే వీఐపీ టికెట్ల కోసం ఎంబీసీల వద్ద నిత్యం భక్తులు గుమిగూడినప్పుడు కానీ.. వాళ్లంతా దర్శనానికి వెళ్లే సమయంలో కానీ కరోనా ప్రబలదట. ఎందుకో టీటీడీనే చెప్పాలి. వైకుంఠ ఏకాదశి రోజున వీవీఐపీల పేరుతో జరిగిన హడావిడి కానీ.. వాళ్లంతా దర్శనానికి వెళ్లిన సమయంలో కానీ.. ఎక్కడా కోవిడ్‌ నిబంధనలు పాటించలేదు. ఆంక్షలు అమలవుతున్నాయో లేదో పట్టించుకోలేదు. అదే సామాన్య భక్తుల దగ్గరకు వచ్చేసరికి నిబంధనల కొరడా ఝుళిపిస్తున్నారు. కొండపై సామాన్యులకే ప్రాధాన్యమనే మాటను మాటలకే పరిమితం చేసి.. పెద్దలను ఒకలా.. సాధారణ భక్తులను మరోలా చూడటమే విమర్శలకు తావిస్తోంది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Ordinary devotees stay away from Srivari Darshan ..