రేషన్ కు ఓటీపీ లింక్

Date:04/12/2020

నల్గొండ ముచ్చట్లు:

రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసరాలు తీసుకోవాలంటే ఇక నుంచి ఆధార్‌ నమోదు తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు రేషన్‌ దుకాణాల్లో ఆధార్‌ వివరాలు ఇవ్వని కార్డుదారులంతా వెంటనే వివరాలు సమర్పించి నిర్ధారణ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి వి.అనిల్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు బయోమెట్రిక్, ఐరిష్‌ నిర్ధారణల ద్వారా రేషన్‌ సరుకులు ఇచ్చే విధానం ఉండగా, ఇప్పుడు వాటికి తోడు ఆధార్‌ నమోదు కూడా తప్పనిసరి కానుంది. ఈ ఉత్తర్వుల మేరకు కార్డు సభ్యులందరూ వారి ఆధార్‌ వివరాలను రేషన్‌ డీలర్ల వద్ద సమర్పించాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.ఒకవేళ ఇప్పటివరకు ఆధార్‌ నమోదు చేసుకోని లబ్ధిదారులు ఇకపై నిత్యావసరాలు కావాలంటే ఆధార్‌ రిజిస్టర్‌ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన వారికి సరుకులు ఇవ్వొచ్చని, లబ్ధిదారులంతా ఆధార్‌ వివరాలు నమోదు చేసుకునేందుకు స్థానిక యూఐడీఏఐ అధికారులతో కలసి సెంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆధార్‌ వివరాలను కూడా బయోమెట్రిక్, ఐరిష్‌ నిర్ధారణల ద్వారా నమోదు చేయాలని, వీలుకాని పక్షంలో లబ్ధిదారులకు వన్‌టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) పంపడం ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. బయోమెట్రిక్, ఐరిష్‌ విధానంలో నిర్ధారణకు వీలుకాని అంధులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, అనారోగ్య సమస్యలతో మంచం పట్టిన లబ్ధిదారులకు మాత్రం ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు.

 రాజులకు కలిసి రాని కాలం..

Tags: OTP link to ration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *