మా రేటు మాదే.. మీ రేటు మీదే. 

Date:15/05/2019
కర్నూలు ముచ్చట్లు:
జిల్లా ఎక్సైజ్ శాఖలో మమూళ్ల సందడి మొదలైంది. చాలా రోజుల తర్వాత ఆమ్యామ్యాలు పుచ్చుకునే మంచి రోజులు రావడంతో అవినీతిపరులు రంకెలేస్తున్నారు. ఒకప్పుడు మద్యం దుకాణాలు, బార్ల నుంచి స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌కు నెలసరి మామూళ్లు వచ్చేవి. స్టేషన్‌లో కానిస్టేబుల్‌ స్థాయి మొదలుకొని రాజధాని ప్రధాన కార్యాలయంలోని వారు సైతం అందుకునేవారు. గతంలో జిల్లా ఉన్నతాధికారుల ఇంటి అద్దెలు మొదలుకొని ఫర్నిచర్‌ వరకు అవినీతి సొమ్ముతో సమకూర్చేవారు. నెలవారీ మామూళ్లకు కృతజ్ఞతగా అధికారులు ఎమ్మార్పీ ఇతరత్రా నిబంధనలను మద్యం వ్యాపారులు ఉల్లంఘించినా చూసీచూడనట్లు వ్యవహరించేవారు. వీటితోపాటు కల్లు దుకాణాల నుంచీ మామూళ్లు ముట్టేవి. కొన్ని దశాబ్దాల కాలంపాటు నెలవారీ ఈ సంప్రదాయం కొనసాగింది. ఆ శాఖ కమిషనర్‌గా లక్ష్మీనరసింహ వచ్చిన తర్వాత దీనికి అడ్డుకట్ట పడింది. అవినీతిపరులపై ఆయన కొరడా ఝుళిపించారు. చేతివాటం ప్రదర్శించిన వారిపై గట్టి చర్యలు తీసుకుని వారి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన మద్యం వ్యాపారులపైనా కఠినచర్యలు తీసుకుని పరిస్థితిని గాడిలో పెట్టారు. ఫలితంగా ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేవారు.
ఎన్నికల ముందు అబ్కారీ శాఖ కమిషనర్‌ లక్ష్మీనరసింహం బదిలీ అయి ముఖేష్‌కుమార్‌ మీనా నియమితులయ్యారు. ఆయన అలా వెళ్లగానే తిరిగి మామూళ్లు ఊపందుకున్నాయి.జిల్లాలో 14 స్టేషన్ల పరిధిలో 206 మద్యం దుకాణాలు 42 బార్లు, రెండు క్లబ్బులు, ఒక షాపింగ్‌మాల్‌లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ శాఖ కమిషనర్‌ లక్ష్మీనరసింహ బదిలీ కావడం.. ఎన్నికలు సైతం ముగియడంతో మద్యం వ్యాపారులు సీసాపై రూ.10కు అధికంగా విక్రయించడం ప్రారంభించారు. చాలాచోట్ల పలువురు అబ్కారీశాఖ అధికారులు నెలసరి మామూళ్ల ఒప్పందంతో రహస్యంగా అనుమతులు ఇచ్చారన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. రాష్ట్రవ్యాప్తంగా మద్యం వ్యాపారుల ఆగడాలు వివాదాస్పదంగా మారడం.. ఇది కమిషనర్‌ దృష్టికి వెళ్లడం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అబ్కారీ శాఖ అధికారులు చర్చలు జరిపి సీసాపై రూ.5 అధికంగా అమ్ముకోమని వ్యాపారులను కోరారు. దీనికి కొందరు సానుకూలంగా స్పందించిన మిగిలినవారు దానిని బేఖాతరు చేస్తూ రూ.10 అధికంగా విక్రయిస్తున్నారు.
గతంలో ప్రతి బారు నుంచి స్థానిక స్టేషన్‌కు రూ.10 వేలు ముట్టేవి. మద్యం వ్యాపారులు సీసాపై రూ.10 అధికంగా విక్రయించే సమయంలో ఒక్కో దుకాణం నుంచి స్టేషన్‌కు రూ.50 వేల వరకు ఇచ్చేవారు. ఈ మేరకు ప్రతినెలా కానిస్టేబుల్‌కు రూ.15 వేలు, హెడ్‌ కానిస్టేబుల్‌కు రూ.30 వేలు, ఎస్సైకి రూ.60 వేలు.. మిగిలిన మొత్తాన్ని స్టేషన్‌ అధికారి తీసుకునేవారు. ఇందులో ఉన్నతాధికారులకు దుకాణానికి రూ.10 వేల చొప్పున ఇచ్చేవారు. వీటితోపాటు ప్రతి కల్లు దుకాణం నుంచి రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు పుచ్చుకునేవారు. అధికంగా మద్యం దుకాణాలు, బార్లు ఉన్న ప్రాంతాల సీఐలకు నెలనెలా పెద్దమొత్తంలో నగదు అందేది. అదే శాఖలో పనిచేసే ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ విభాగాలకు మద్యం వ్యాపారులు ప్రత్యేకంగా మామూళ్లు ఇచ్చేవారు. సీఐలు, ఉన్నతాధికారులు నెలసరి మామూళ్లతో రూ.కోట్లు సంపాదించారు.మద్యనిషేధ అబ్కారీశాఖ అధికారులు నెలసరి మామూళ్లపై ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. బార్ల నిర్వాహకులు ప్రతి నెలా రూ.15 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఎమ్మార్పీపై రూ.5 అధికంగా అమ్ముకోమని అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మద్యం దుకాణ నిర్వాహకులు ప్రతి నెలా రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. డీటీసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలకు కూడా ఒక్కో
దుకాణం ద్వారా రూ.15 వేలు ఇవ్వనున్నారు. పలు ప్రాంతాల్లో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈనెల 10వ తేదీన నాటికి మామూళ్లు అందనున్నాయి. పలు ప్రాంతాల్లో ఇది తెగని వ్యవహారంలా మారింది.
Tags: Our rate is yours. Your rate is yours.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *