అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు మొదలు
విజయవాడ ముచ్చట్లు:
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు ప్రారంభమైంది. పదేళ్ల లోపు సర్వీసు ఉన్న వారిని ఉద్యోగాల నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుట్టుచప్పుడు కాకుండా ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు నవంబర్ 28వ తేదినే ప్రభుత్వం అన్ని శాఖలకు ఉత్తర్వులు పంపినట్లు సమాచారం. పై నుండి అందిన ఆదేశాల అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శనివారం ఈ విషయం రాష్ట్ర వ్యాపస్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులలో కలకలం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్లలోపు సర్వీసు ఉన్న 2.40 మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఏ రోజైనా తమ ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని ఆశించిన వీరందరూ ఇప్పుడు తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలో చిక్కుకున్నాయి. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు తీరుస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ‘సమాన పనికి- సమాన వేతనం’ ప్రాతిపదికన న్యాయం చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. ఇటీవల ఒడిషా ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుందరినీ క్రమబద్దీకరించడం, భవిష్యతు ్తలో అటువంటి నియమాకాల ను చేసేది లేదని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లోనూ ఆశలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే పదేళ్ల సర్వీసు నిండిన వారినందరినీ క్రమబద్దీ కరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందంటూ వార్తలు కూడా వచ్చాయి.
అయితే, ఆచరణలో జరిగింది దానికి భిన్నం. పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారిని ఇళ్లకు పంపాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పదేళ్లకన్నా ఎక్కువ సర్వీసు ఉన్న వారిలో కూడా భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమవుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం నాలుగు రకాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు పడనుంది. వీరిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, అటెండర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ విధులు నిర్వహిస్తూ పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేయని వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. క్షేత్రస్థాయి నుండి సమాచారం అందిన తరువాత ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ విడివిడిగా తొలగింపు ఆదేశాలను జారీ చేయనుందని సమాచారం. శనివారం ‘డైరక్టరేట్ ఆప్ వర్క్స్ అక్కౌంట్స్’ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులలో ‘ప్రభుత్వం నుండి ఆదేశాల ప్రకారం పది సంవత్సరాలు పూర్తి కానివారినందరిని తక్షణమే సర్వీసు నుండి నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని జెడిడబ్య్లుఎలను, పిఎఓలను ఆదేశించారు. ఈ మేరకు తొలగించిన వారిలో మూడు సంవత్సరాల నుండి 8 సంవత్సరాల తొమ్మిది నెలల సర్వీసును పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు.

పది సంవత్సరాల సర్వీసుకు ఒక్క రోజు తక్కువైనా నిలిపివేయక తప్పదని అధికారులు అంటున్నారు.సమైక్య రాష్ట్ర విభజన అనంతరం 90 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా రిక్రూట్ అయ్యారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిక్రూట్ మెంట్ కోసం ఏకంగా ‘ఆప్కాస్’ అనే వ్యవస్థను తీసుకొచ్చింది. దీని ద్వారా రాష్ట్ర కేంద్రంతోపాటు జిల్లాలో కూడా నియామకాలు చేసింది.వీరందరుకూడా తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ఆశిస్తూ ఉన్నారు. తాజా ఉత్తర్వులు వీరికి శరాఘాతంగా మారాయి. వీరికి రూ.16 వేల నుంచి రూ.23 వేలలోపు స్వల్ప జీతాలు ఇస్తున్నారు. వీరిలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారు.తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం’ సమానపనికి సమాన వేతనం’ ‘ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం’ అని ప్రతిపక్ష నాయకునిగా జగన్మోహన్రెడ్డి హామీనిచ్చి, నేడు అందుకు భిన్నంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ఎవి నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Tags: Outsourcing begins with hiring employees
