సీఎంవోలో 1500 పైగా ఫైల్స్

Date:15/07/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

పెండింగ్‌.. పెండింగ్‌.. పెండింగ్‌… పలు అంశాలకు సంబంధించిన ఫైళ్ల గురించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఉన్నతాధికారిని అడిగినా ఇప్పుడు వారి నోటి నుంచి వస్తున్న మాట ఇదే. తాత్కాలిక సచివాలయం (బీఆర్కే భవన్‌) నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం (మెట్రో రైల్‌ భవన్‌, బేగంపేట) దాకా ఇదే పరిస్థితి నెలకొంది. అత్యవసరం, అనివార్యమైతే తప్ప మిగతా దస్త్రాలను ముట్టని పరిస్థితి నెలకొంది. దీంతో గత మూడు నెలలుగా వివిధ కార్యాలయాల్లో అవి గుట్టలుగా పేరుకుపోయాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం… కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోనే దాదాపు 1,500 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి ఎప్పుడు మోక్షం కలుగుతుందో తెలియని పరిస్థితి. పాత సచివాలయం కూల్చివేత పనులు కొంత మేరకు కొనసాగి… కోర్టు స్టేతో ప్రస్తుతానికి ఆగిపోయాయి. అక్కడి సీఎస్‌ కార్యాలయాన్ని ఏడాది క్రితమే బీఆర్కే భవన్‌కు తరలించారు. మంత్రుల ఛాంబర్లను కూడా నగరంలోని వివిధ కమిషనరేట్లు, ఇతర ప్రధాన ఆఫీసులకు తరలించారు. ప్రస్తుతం కరోనా భయంతో బీఆర్కే భవన్‌కు రొటేషన్‌ పద్ధతిన కొద్ది మంది ఉద్యోగులే విధులకు హాజరవుతుండటంతో అక్కడి దస్త్రాలను పట్టించుకునే నాథుడే లేకపోయాడు.

 

 

 

ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్‌ను నిర్వహించే ఆనవాయితీ ఉండేది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి స్వస్తి పలికారు. ప్రగతి భవన్‌కు గానీ, మంత్రుల నివాసాలకుగానీ వెళ్లి వినతి పత్రాలు సమర్పించాలని భావిస్తే.. అందుకు అనుమతులు రానేరావు. దీంతో అటు పెండింగ్‌ ఫైళ్లు పరిష్కారంగాక.. ఇటు వినతిపత్రాలు స్వీకరించే వారు లేక విలవిల్లాడిపోతున్నామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమకు నచ్చిన, ప్రాధాన్యమైన ఫైళ్లపై మాత్రం ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఆగమేఘాల మీద సంతకాలు చేసుకుని, పరిష్కరించుకుంటున్నారని ఓ సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించటం గమనార్హం. మరోవైపు పేదలకు అతి ముఖ్యమైన, అత్యంత అవసరమైన సీఎంఆర్‌ఎఫ్‌ (చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌)కు సంబంధించిన దరఖాస్తుల పరిస్థితి కూడా ఇదే విధంగా మారింది. వాస్తవానికి చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు ఆర్నెల్లలోపు ఈ దరఖాస్తులను ప్రభుత్వానికి (సాధారణ పరిపాలనాశాఖ)కు పంపించాల్సి ఉంటుంది. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లేదా మంత్రి నుంచి సిఫారసు లెటర్లను బాధితులు తీసుకోవాలి. అక్కడి నుంచి నేరుగా సాధారణ పరిపాలనాశాఖకు ఆ ఫైళ్లు వెళతాయి. అక్కడ పరిశీలన, ఉన్నతాధికారుల సంతకాలు పూర్తయ్యాక బాధితుల చిరునామాకే చెక్కులను నేరుగా పంపిస్తుంటారు.

 

 

ఒకవేళ ట్రీట్‌మెంట్‌ తీసుకున్న ఆర్నెల్లలోపు దరఖాస్తులు సమర్పించకపోతే.. ఆ తర్వాత వాటిని పరిగణనలోకి తీసుకోరు. అయితే కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఈ దరఖాస్తులను స్వీకరించటం లేదని తెలిసింది. మార్చి నుంటి సాధారణ పరిపాలనశాఖ వీటిని తీసుకోవటం లేదని సమాచారం. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల వద్దే ఈ దరఖాస్తులు ఉండిపోయాయి. ఫలితంగా పేద రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము సమర్పించిన దరఖాస్తులు చెల్లుతాయో.. లేదోనంటూ వారు ఆవేదన చెందుతున్నారు. ఇక తాజాగా (జూన్‌, జులైలో) ట్రీట్‌మెంట్‌ తీసుకున్న వారి అప్లికేషన్లను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ‘ఇప్పుడు వాటిని తీసుకుని, పైకి పంపే పరిస్థితి లేదు… వచ్చే నెల్లో, కరోనా తగ్గితే అప్పుడు చూద్దాం…’ అంటూ ఒక మంత్రి పీఆర్వో జవాబివ్వటం గమనార్హం. ఈ నేపథ్యంలో కరోనాతో సంబంధం లేకుండా సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులను స్వీకరించి, పరిష్కరించి.. త్వరితగతిన తమకు ఆర్థిక సాయం అందేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.

నల్గొండలో భారీగా తగ్గిన పసుపు సాగు

Tags:Over 1500 files in CMVO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *