ఊరందరది ఒక దారి…-పవన్ ది మరో దారి

Date:13/03/2018
విజయవాడ ముచ్చట్లు:
రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించాడట. అలా ఉంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అంతా పోరాడే పనిలో ఉంటే… తాను తీరిగ్గా ఇంటిని నిర్మించుకునే పనిలో పడ్డారు పవన్. హోదా కోసం పోరాటం చేస్తానని వీరావేశంగా మాట్లాడారు. భారతదేశంలోని పార్టీలన్నింటినీ కలిసి… మద్దతు కూడగడతానని చెప్పారు. ఆ సంగతి మర్చిపోయారు. రాజకీయ నాయకుడుగా మారాక పవన్ కల్యాణ్ బాగా అబద్దాలు ఆడుతున్నారనే చర్చ సాగుతోంది. ఆవేశంగా మాట్లాడటం, తెల్లారి ఆ మాటలకు విరుద్దంగా వ్యవహరించడం పవన్ కల్యాణ్ నైజంగా మారింది. మీరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి. నేను మీకు అండగా ఉంటానని ఏపీలోని పార్టీలకు సవాల్ విసిరిన ఆయన ఇప్పుడు మౌనం దాల్చారు. తనకు చేతగాదనే విషయాన్ని ఒప్పుకోలేక బోల్తా పడ్డారు. తన సవాల్ ను వైకాపా తీసుకోదని భావించారు. తీరా వారు సవాల్ ను తీసుకోవడమే కాదు.. అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చేందుకు సిద్దమైనా ఏం చేయలేకపోతున్నారాయన. రాజకీయ నాయకుడిగా పవన్ అసలు పనికి రాడని కత్తి మహేష్ లాంటి వారు ఎప్పుడో చెప్పేశారు. ఇప్పుడు పవన్ తీరు అలానే ఉంది. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ఏపీలో ఉండడానికి వీలుగా పవన్ కల్యాణ్ ఇంటిని నిర్మించుకుంటున్నాడు. మంచిదే. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతగా ఆందోళనలు జరుగుతున్నా.. మౌనం దాల్చడం కాస్తంత ఆశ్చర్యంగా ఉంది. పవన్ కంటే చిరంజీవినే కాస్తంత నయం. వీరావేశంగా మాట్లాడరు. చెప్పింది చేస్తారంటున్నారు. తనతో పాటు దీర్ఘకాలం పనిచేయడానికి సిద్దపడేవారిని ఎంపిక చేసుకుంటున్నానని పవన్ చెబుతున్నాడు. ముందుగా పన్నెండు మందితో కూడిన స్పీకర్ల పానెల్ ఎంపిక చేసినట్లు పవన్ ప్రస్తావించారు. తనవి దోచేసిన ఆస్తులు కావని, ప్రజల అబిమానంతో సంపాదించిన ఆస్తులని చెప్పారు. తన తండ్రి ముఖ్యమంత్రి కాదని, అందువల్ల ఒక్కొక్కటి సమకూర్చుకుని పార్టీని తయారు చేస్తున్నానని పరోక్షంగా జగన్ అవినీతిని ప్రస్తావించారు. గుంటూరు జిల్లా కాజ వద్ద పవన్ కళ్యాణ్ ఈ గృహ నిర్మాణం చేపట్టారు. ఇందుకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే పార్టీ కార్యాలయానికి భవన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
Tags: Pallan the other way

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *