కరోనా మహమ్మారిని జయించేందుకు పంచ సూత్ర ప్రణాళిక

– ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

 

హైదరాబాద్  ముచ్చట్లు:

 

కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనగలమని ఆయన పేర్కొన్నారు. కరోనాపై వస్తున్న అపోహలు, పుకార్లను విశ్వసించడం ద్వారా ఆందోళనే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదన్నారు.కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, వివిధ నేపథ్యాలకు చెందిన 80 మంది రచయితల కథలను వంశీ ఆర్ట్స్ థియేటర్ రూపొందించిన ‘కొత్త (కరోనా) కథలు’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కరోనాను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన పంచసూత్రాలను ఉపరాష్ట్రపతి ప్రతిపాదించారు. మొదటగా కోవిడ్ ఎదుర్కొనే దిశలో శారీరక శ్రమ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అవసరం అన్న ఆయన, చైతన్యరహిత జీవన విధానం కారణంగా కొత్త సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వ్యాయామం, నడక, యోగ లాంటి వాటికి రోజూ కొంత సమయం కేటాయించాలని సూచించారు.రెండో అంశంగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, మానసిక సంతులనానికి ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి సూచించారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.మూడో అంశంగా అత్యంత కీలకమైన అంశంగా భారతీయ ఆహారపు అలవాట్లను ఆయన ప్రస్తావించారు. మన దేశంలోని వాతావరణ మార్పులకు అనుగుణంగా మన పెద్దలు ఆహారాన్ని సూచిస్తూ వచ్చారని, వ్యర్థమైన జంక్‌ఫుడ్ మీద గాక సంతులన, పోషకాహారం మీద ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.వ్యక్తిగత పరిశుభ్రత, జాగ్రత్తలు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా సురక్షిత దూరాన్ని పాటించడం, మాస్క్ లను ధరించడం, తరచూ చేతులను శుభ్రపరచుకోవడం వంటి వాటిని నాలుగో అంశంగా ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

 

 

 

 

టీకా వేయించుకోవడం తప్పనిసరి అని, ఆ తర్వాత కూడా మాస్క్ ధరించడంతోపాటు సురక్షిత దూరాన్ని పాటిస్తూనే ఉండాలన్నారు.ఐదో అంశంగా ప్రకృతిని ప్రేమించడం ప్రకృతితో మమేకమై జీవించడంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఏసీ గదుల్లో కాకుండా.. వీలైనంత ఎక్కువగా గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాల్లో ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ ఐదు అంశాలను పాటిస్తూనే భయాన్ని వీడి ప్రతి ఒక్కరూ ఇతరులకు సాయం చేసే దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించిన ఆయన, జాగ్రత్త పడడమే తప్ప, పుకార్లు, భయాలతో ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న అనేక దేశాలు కరోనా బారిన పడి విలవిల్లాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారత్ ప్రారంభంలో ఆందోళనకు గురయినా వెంటనే తేరుకుని ప్రభుత్వాలు, ప్రజల భాగస్వామ్యంతో  ఈ మహమ్మారితో పోరాటం చేయడంలో ముందు వరుసలో ఉందన్నారు.మన శాస్త్రవేత్తలు, పరిశోధనకారుల కృషితో టీకాను తయారు చేసి మన ప్రజలకే కాకుండా, విదేశాలకు  సైతం అందిస్తూ.. మన జీవన విధానమైన ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద టీకాకారణ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టీకా తీసుకునే విధంగా చొరవతీసుకోవాలని యువతకు ఉపరాష్ట్రపతి సూచించారు.

 

 

 

 

ప్రజల్లో టీకాకరణపై ఉన్న అపోహలను తొలగించడం ద్వారా  టీకాకరణను ఓ ప్రజాఉద్యమంగా రూపుదిద్దడంలో ప్రతి భారతీయుడు తనవంతు బాధ్యతను పోషించాలన్నారు.కరోనా కొత్తకథల్లో భాగస్వాములైన రచయితలందరినీ ఉపరాష్ట్రపతి అభినందించారు. కొత్త అనుభవాలనుంచి పుట్టిన కథలు ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని గానగంధర్వుడు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యంకు అంకితమివవ్వడాన్ని, ముఖచిత్రంగా ఎస్పీబీ చిత్రాన్ని ప్రచురించడం పట్ల ఉపరాష్ట్రపతి పుస్తక ప్రచురణకర్తలను ప్రత్యేకంగా అభినందించారు.బాలసుబ్రమణ్యం జీవితం తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్న ఆయన, తెలుగు సంగీతానికి ఘంటసాల, బాలు ద్వయం స్వర్ణయుగం తీసుకొచ్చారని గుర్తుచేశారు. వీరిద్దరూ తెలుగు పాటకు పట్టాభిషేకం చేసి, ప్రేక్షక హృదయ సింహాసనంపై కూర్చోబెట్టారన్నారు. ఐదున్నర దశాబ్దాలపాటు తన గానామృతంతో సంగీతాభిమానులను అలరించిన బాలసుబ్రమణ్యం కరోనా కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం అత్యంత విచారకరమన్న ఉపరాష్ట్రపతి ఈ వేదిక ద్వారా మరోసారి బాలు స్మృతికి నివాళులు అర్పించారు.జీవితంలోని ఒకానొక మహత్తర సత్యాన్ని అద్భుత శిల్పనైపుణ్యంతో కళ్ళకు కట్టినట్లు చూపించి, హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతితో నింపి, పదే పదే చదవాలనిపింపజేసేది గొప్ప కథ అన్ పోరంకి దక్షిణామూర్తి గారి మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి,

 

 

 

 

ఎన్నో మంచి కథలను తెలుగు వారికి మరింత చేరువ చేసేందుకు ప్రయత్నం చేసిన కాళీపట్నం రామారావుని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ ఏడాది జూన్ 4న కాళీపట్నం రామారావు అంతకు ముందు ఫిబ్రవరి 6న పోరంకి దక్షిణామూర్తి పరమపదించారన్న ఉపరాష్ట్రపతి వారిద్దరి స్మృతికి ఈ వేదిక ద్వారా నివాళులు అర్పించారు.మాతృభాష మాధుర్యాన్ని గుర్తుచేస్తూ ప్రతి భారతీయుడు తమ మాతృభాషలను కాపాడుకునేందుకు కృషిచేయాలన్నారు. ఇందుకోసం కూడా ఉపరాష్ట్రపతి పంచసూత్ర ప్రణాళికలను ప్రతిపాదించారు. 1. వీటిలో మొదటిది ప్రాథమిక విద్య మాతృభాషలో అందేలా చూడటం.2.

 

 

 

 

పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం.3. న్యాయస్థానాల కార్యకలాపాలు సైతం మాతృభాషలోనే సాగాలి. తీర్పులు తల్లిభాషలోనే ఇవ్వాలి.4. ఉన్నతవిద్య, సాంకేతిక విద్యల్లో స్వదేశీ భాషల వినియోగం క్రమంగా పెరగాలి.5. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో, తమ కుటుంబ సభ్యులతో మాతృభాషలోనే మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్నప్పటికీ అమ్మభాషను మరచిపోకుండా మాతృభూమితో మమేకమవుతూ ఈ కొత్త కథలు పుస్తకంలో తెలుగు కథలతో ఆకట్టుకున్న ప్రవాసాంధ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మన సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను ముందు తరాలకు అందించేందుకు సృజనాత్మక మార్గాలను అన్వేషించి, వాటిని అక్షరబద్ధం చేసి ముందుతరాలను ప్రేరేపించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిమీదా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, అమెరికాకు చెందిన గుండె వైద్య నిపుణులు, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, వంశీ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీరామరాజు, అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి, ప్రముఖ రచయితలు  యండమూరి వీరేంద్రనాథ్, అంపశయ్య నవీస్, భువన చంద్ర సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన రచయితలు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Pancha Sutra plan to conquer the corona epidemic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *