పంచభూతాలను సక్రమంగా వినియోగించుకోవాలి – ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి
తిరుమల ముచ్చట్లు:
పంచభూతాలైన నేల, నింగి, నీరు, నిప్పు, గాలిని సక్రమంగా వినియోగించుకోవాలని వేదాలు ఘోషిస్తున్నాయని గుజరాత్‌లోని సోమనాథ్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య వెంపటి కుటుంబశాస్త్రి తెలియజేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల నాదనీరాజన వేదికపై శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనివాస వేద విద్వత్ సదస్సు సోమవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆచార్య కుటుంబ శాస్త్రి మాట్లాడుతూ పంచభూతాలే ప్రకృతికి మూలమని, వీటిని రక్షించుకోవాలని సూచించారు. మానవజీవన వికాసానికి అవసరమైన అన్ని విషయాలను మన పూర్వీకులు వేదాల ద్వారా అందించారని తెలిపారు. వేద విజ్ఞానాన్ని భావితరాలకు అందించేందుకు టీటీడీ వేద విద్వత్ సదస్సు నిర్వహించడం ముదావహమన్నారు.ముందుగా వేదపండితులు నాలుగు వేదాల్లోని ఐదు శాఖలను పారాయణం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డా. విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:Panchabhutas should be used properly – Acharya Vempati Family Shastri
