వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం
– కనులవిందుగా సిరుల తల్లికి స్నపనతిరుమంజనం
– పద్మ పుష్కరిణి స్నానంతో తన్మయుత్వం చెందిన భక్తులు
తిరుపతి ముచ్చట్లు:

శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.ఉదయం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
అమ్మవారికి శ్రీవారి కానుక
శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు . రూ. 25 లక్షలు విలువ చేసే 500 గ్రాములు బరువు గల రెండు బంగారు పతకాలు, ఒక హారం, సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
శోభాయమానంగా సిరుల తల్లి స్నపనతిరుమంజనం
పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి.
కుంకుమపువ్వు, అత్తిపండు, బాదం, జీడిపప్పు, నెల్లి కాయలు, రోజా, తులసి మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన శ్రీ షణ్ముగ సుందరం, శ్రీ బాలసుబ్రమన్యన్ ఈ మాలల తయారీకి విరాళం అందించారు.
ఆకట్టుకున్న ఫలపుష్పం మండపం
పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఏర్పాటుచేసిన ఫలపుష్ప మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఇందులో ఆపిల్, ఆస్ట్రేలియా ఆరంజ్, తామర పూలు, రోజాలు, లిల్లీలు , కట్ ఫ్లవర్స్, సాంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
ఉదయం 11.40 నుండి 11.50 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది.
చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
కాగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 9.30 నుండి 10.30 గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్, టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు,
చంద్రగిరి ఎంఎల్‌ఏ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, రామేశ్వరరావు, శ్రీ రాములు, మారుతి ప్రసాద్, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, జేఈవో లు సదా భార్గవి , వీరబ్రహ్మం దంపతులు, సివిఎస్‌వో నరసింహ కిషోర్, సి ఈ నాగేశ్వరరావు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నవంబరు 29న పుష్పయాగం
నవంబరు 29వ తేదీ మంగళవారం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరుగనుంది.
Tags:Panchami Teertham of Goddess Shri Padmavati
More about this source textSource text required for additional translation information
Send feedback
