గోమాత, భూమాత పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కండి

– తిరుపతి హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులకు టీటీడీ ఈవో  ఎ వి ధర్మారెడ్డి పిలుపు

 

తిరుపతి ముచ్చట్లు:

హిందూ ధర్మ ప్రచారంతో పాటు, గోమాతను, భూమాతను పరిరక్షించి సమాజాన్ని రసాయన ఎరువుల దుష్ప్రభావం నుంచి రక్షించేందుకు టీటీడీ ప్రారంభించిన గో ఆధారిత ఉత్పత్తుల వినియోగం యజ్ఞంలో భాగస్వాములు కావాలని టీటీడీ ఈవో  ఎ వి ధర్మారెడ్డి పిలుపునిచ్చారు.టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో బుధవారం ఆయన తిరుపతి హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో స్వామివారి చిత్రపటాలు, అగరబత్తులు టీటీడీ తయారు చేస్తోందన్నారు. అలాగే పంచగవ్యాలతో సోపులు,షామ్పులు, ఫ్లోర్ క్లీనర్లు తదితర 32 రకాల ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. దీంతోపాటు దేశ వాళీ గోజాతులు,గో ఆధారిత వ్యవసాయం అభివృద్ధికి టీటీడీ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. వీటివల్ల పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జలుగుతుందని ఈవో వివరించారు. లాభాపేక్ష లేకుండా సామాజిక ప్రయోజనం కోసం టీటీడీ తయారు చేసిన పంచగవ్య ఉత్పత్తులు, ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో అగరబత్తీలు,

 

డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన స్వామివారి ఫోటో ఫ్రేమ్ లు ఇతర ఉత్పత్తులను భక్తులకు మరింత దగ్గర చేయడానికి తిరుపతి హోటళ్లలో వీటిని ఉపయోగించాలన్నారు. తిరుపతి నుంచి ప్రారంభించే ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈవో ప్రతిపాదనకు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతోపాటు వారు అనేక సూచనలు, సలహాలు చేశారు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఈవో చెప్పారు.అనంతరం హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈవో  ధర్మారెడ్డిని శాలువలతో సన్మానించారు.

జెఈవో   వీరబ్రహ్మం,
ఎఫ్ఎ సిఏఓ   బాలాజి, ఎస్వీ గో సంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి పాల్గొన్నారు. పంచగవ్య ఉత్పత్తుల తయారీ, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

 

Tags:Participate in the Yajna for the protection of cow and mother earth

Leave A Reply

Your email address will not be published.