పారిశ్రామికంగా బద్వేలు నియోజక అభివృద్ధికి బాటలు

– జిల్లా కలెక్టర్ వి.విజయ రామరాజు


గోపవరంలో నూతన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటుకు వర్చువల్ విధానం ద్వారా శంఖుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి

బద్వేలు ముచ్చట్లు:

 

Post Midle

బద్వేలు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధిచేసి… ఆ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి.. వైఎస్ఆర్ జిల్లాలోని గోపవరం మండలంలో మైక్రో & స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్  కింద 68.49 ఎకరాల్లో నూతనంగా ఏర్పాటు చేయ తలపెట్టిన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు.. బద్వేలు ఎమ్మెల్యే డా. దాసరి సుధ, కుడా (KUDA) చైర్మన్ గురు మోహన్, ఏపీఐఐసి డైరెక్టర్ గోపవరం ప్రభాకర్ రెడ్డి, ఏపీఐఐసి కడప జెడ్ఎం కె. శ్రీనివాస మూర్తి హాజరయ్యారు. వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి కార్యక్రమం ముగిసిన అనంతరం.. బోర్డు మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన నూతన ఇండస్ట్రియల్ ఎస్టేట్ కు సంబందించిన శిలాఫలకాన్ని జిల్లా కలెక్టర్.. ముఖ్య అతిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ… మైక్రో & స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (MSE-CDP) కింద జిల్లాలోని గోపవరం మండలంలో 68.49 ఎకరాల్లో ఏర్పాటవుతున్న నూతన ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 15.25 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలుపడం జరిగిందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న ఈ నూతన ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధికి  రూ. 10.50 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులను, రూ. 4.75 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు.

 

 

 

గోపవరం నూతన ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో భాగంగా అంతర్గత రోడ్లకు రూ.8.65 కోట్లు, వర్షపు నీటి డ్రైనేజీల కోసం రూ. 4.29 కోట్లు, విద్యుత్ సరఫరాకు గాను రూ.2 కోట్లు, అత్యవసర ముందస్తు వైద్య సదుపాయాలకు గాను రూ.30 లక్షలు కలిపి… మొత్తం రూ.15.25 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో వందలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందనున్నాయన్నారు. ఇప్పటికే జిల్లాలో గోపవరం, కోప్పర్తి, పులివెందులలో నూతన పరిశ్రమల స్థాపనతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అందుతోందన్నారు. రాబోయే రోజుల్లో గోపవరం పారిశ్రామిక వాడ ద్వారా బద్వేలు నియోజకవర్గం  మరింత అభివృద్ధి పథంలోకి రానుందన్నారు. సెంచరీ ఫ్లై పరిశ్రమ ద్వారా గోపవరం ప్రాంతం ఇప్పటికే పారిశ్రామిక గుర్తింపును పొందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పరిశ్రమల స్థాపనతో జిల్లాలో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు.. జిల్లాను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి సంబందిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Paths for the development of Badwelu Constituency industrially

Post Midle