Jensana tension for TDP

సరికొత్త వ్యూహాలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్

 Date:21/02/2019
విశాఖపట్టణం ముచ్చట్లు:
ఎన్నికలు దగ్గరపడుతున్నందున జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. అందుకోసం గతంలోనే ఇతర పార్టీలకు చెందిన, వివాదరహితులుగా ఉన్న నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పాటు జనసేన సభ్యత్వం కూడా అంతకంతకూ పెంచేలా చర్చలు చేపడుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా జనసైనికులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మధ్య బహిరంగ సభలు, సమావేశాలు, యాత్రలను తగ్గించిన పవన్.. పూర్తిగా పార్టీ వ్యవహారాలపైనే దృష్టి సారించారు. ఒకవైపు రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికలకు ప్లాన్లు రెడీ చేసుకుంటుండడంతో జనసేనాని కూడా వేగంగా సమాయత్తం అవ్వాలని చూస్తున్నారు. అందుకోసం ఎన్నికల్లో ముఖ్యమైన ప్రక్రియ అభ్యర్థుల ఎంపికపై బాగా ఫోకస్ చేశారు. అధికారాన్ని చేపట్టే అవకాశం లేకున్నా.. వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి కావాలని ఆయన అనుకుంటున్నారు. అందుకోసం గెలుపు గుర్రాల ఎంపిక ప్రక్రియను ఇటీవల ప్రారంభించారు.
అభ్యర్థుల ఎంపిక విషయంలో గతంలో ఏ పార్టీ అమలు చేయని కొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో పారదర్శకత కోసం సరికొత్త పంథాలో జనసేన పార్టీ ముందుకు సాగుతోంది. టికెట్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చంటూ అందరికి స్వేచ్ఛను ఇచ్చారు పవన్ కల్యాణ్. అందుకోసం పార్టీలో సీనియర్లుగా ఉన్న మాదాసు గంగాధరం, శ్రీ అర్హం ఖాన్, మహేందర్ రెడ్డి, హరిప్రసాద్, శివశంకర్ వంటి నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విజయవాడ కార్యాలయంలో దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. పవన్ కల్యాణ్ కూడా ఇదే కమిటీకి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రతి రోజూ దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. మంగళవారం నాటికి కమిటీకి 150 మందికి పైగా ఆశావాహులు దరఖాస్తులు అందజేశారు. వీరిలో టీమిండియా మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు ఉన్నారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వేణు కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరంకు తన బయోడేటాను అందజేశారు. తన వివరాలను ఆ బయోడేటాలో పొందుపరిచారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం వెల్లడించింది. ఈ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
అయితే, ఆయన ఎక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారన్న విషయం మాత్రం తెలియలేదు.గతంలో పవన్ విశాఖలో పర్యటిస్తున్న సమయంలో వేణుగోపాలరావు జనసేన కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఇతడు భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అలాగే రంజీలలో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ముంబై, రాజస్థాన్ జట్ల తరపున ఆడాడు. అలాగే భారత క్రికెట్ జట్టు తరపున వేణుగోపాలరావు 2005లో శ్రీలంకతో జరిగిన తొలి వన్డే, 2006లో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడారు. మొత్తం 16 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన వేణుగోపాలరావు 24.22 సగటుతో 218 పరుగులు చేశారు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది.
Tags:Pawan Kalyan, the leader of the Janasana with new strategies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *