కేసీఆర్ మంత్రివర్గం కూర్పుపై దృష్టి

Pay attention on the composition of the KCR

Pay attention on the composition of the KCR

Date:01/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
సీఎం కేసీఆర్ మంత్రివర్గం కూర్పుపై దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యుల తో చర్చించడంతో పాటు సామాజిక సమీకరణలను విశ్లేషిస్తున్నారు. జనవరి 5వ తేదీ నాటికి పరిమితమైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. కొందరు మాజీ మంత్రులకు ఈ కూర్పులో అవకాశం ఉండకపోవచ్చని, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన ఒక మాజీ మంత్రికి మంత్రి వర్గంలో స్ధానం కల్పించే అవకాశం ఉందని తెలిసింది. ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావును మంత్రివర్గంలోకి తీసుకొ నేందుకు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయని అంటున్నారు. కొందరు సీనియర్ మంత్రులను పార్లమెంటు బరిలోకి దించే ఆలోచన లో ఉన్న కేసీఆర్ వారి స్ధానంలో సామాజిక వర్గాల సమీకరణ మేరకు కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు విధేయులుగా ఉన్న వారికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రెండో మంత్రివర్గంలో స్దానం ఉంటుందని పేర్కొంటున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీక రించిన కేటీఆర్‌కు మంత్రివర్గంలో చోటుండబోదని తెలిసింది.
పార్లమెంటు ఎన్నికల తర్వాతనే ఆయనకు ప్రభుత్వంలో అగ్రస్ధానం లభించే ఆవకాశం ఉందనే గుసగుసలు గుప్పుమంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు సీనియర్ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను పార్లమెంటుకు పోటీ చేయించే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా టీఆర్‌ఎస్ వర్గాల్లో జరుగుతుంది. ఇదే నిజమైతే మంత్రివర్గంలో ఈ ఇద్దరికి స్ధానం ఉండకపోవచ్చంటున్నారు. ముఖ్యమంత్రితో నిత్యం అత్యంత సన్నిహితంగా తిరిగే ఇద్దరు ముగ్గురికి మంత్రివర్గంలో స్ధానం లభించడం దాదాపు ఖరారైందం టున్నారు. ఒక మహిళను కూడా మంత్రివర్గంలోకి తీసుకొనే ఆలోచనలో ఉన్నందున ఆలేరు, ఖానాపూర్, మెదక్ నుంచి రెండో సారి గెలుపొందిన మహిళా శాసనసభ్యులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నంలో ఉన్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలతో పాటుగా మంత్రివర్గం కూర్పు, పార్లమెంటు ఎన్నికల గురించి సమాలోచనలు జరిపారంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను ముందుగానే ప్రకటించినట్లుగా పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొందరు సిట్టింగ్‌లతో పాటు ఇద్దరు ముగ్గురు కొత్తవారి పేర్లు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. సీఎం కేసీఆర్ పార్లమెంటుకు పోటీ చేయాలని భావించిన పక్షంలో కరీంనగర్ నుంచి బరిలోకి దిగుతారని, ప్రస్తుతం ఈ స్ధానం నుండి పార్లమెంటులో ప్రాతినిథ్యం వహిస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్‌ను మరో నియోజక వర్గంలో పోటీకి దింపే అవకాశం ఉందంటున్నారు. ఇదే విధంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ శాసనసభకు ఎన్నికైనందున ఆయన స్ధానంలో మాజీ ఎంపీ గడ్డం వివేక్ పోటీ చేయడానికి అవకాశం ఉందని అంటున్నారు. మేడ్చల్ నుంచి మల్లారెడ్డి స్ధానంలో కొత్తవారిని బరిలోకి దింపడంతో పాటుగా చేవెళ్లలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిని బరిలోకి దింపేందకు కేసీఆర్ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిసింది.
నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి శాసనమండలికి ఎంపిక కావడం ద్వారా మంత్రివర్గంలో స్ధానం కోసం ప్రయత్నిస్తున్నందున ఆయన స్ధానంలో కొత్త వారికి అవకాశం  ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. పార్లమెంటుకు అభ్యర్ధులను ఎంపిక చేయడంతో పాటు మంత్రివర్గం కూర్పులో కూడా కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేటీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టినందున మంత్రివర్గం ఆయనకు సహకరించేదిగా ఉండాలని అధినేత భావిస్తున్నారని సమాచారం. తాను జాతీయ రాజకీయాలపై దృష్టి  కేంద్రీకరిస్తున్నందున కేంద్రంలో చక్రం తిప్పగలిగిన వారినే పార్లమెంటుకు గెలిపించుకోవాలని కేసీఆర్ ఆలోచనగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Tags:Pay attention on the composition of the KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed