కమలంపై కస్సుబుస్సులాడుతున్న రైతులు

విజయవాడ ముచ్చట్లు:

ఏపీ బీజేపీ ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోందా? రాజధాని అమరావతి విషయంలో బీజేపీని అక్కడి రైతులు ఎందుకు తప్పు పడుతున్నారు? ప్రతికూల రాజకీయ వాతావరణంలో పాదయాత్రతో కమలనాథులకు ప్రయోజనం ఉందా? అమరావతి ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రలో ఏపీ బీజేపీ నేతలకు ఎదురైన అనుభవం ఇది. ఏపీ రాజధాని విషయంలో బీజేపీకి నేతలకు క్లారిటీ ఉందో.. లేక అక్కడి రైతలుకు స్పష్టత ఉందో కానీ.. వీర్రాజును నిలదీసిన ఉదంతం మాత్రం అనేక ప్రశ్నలకు వేదికగా నిలుస్తోంది. ఏపీ ఏకైక రాజధాని అమరావతి అనే నినాదాన్ని బీజేపీ అందుకున్నా.. రాజధాని గ్రామాల ప్రజలు ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారనడానికి ఈ ఘటన అద్దం పడుతోంది. మూడు రాజధానుల ప్రకటన వచ్చాక ఉద్యమించిన ఇక్కడి రైతులు.. బీజేపీపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ విపక్షానికి పరిమితం కావడంతో బీజేపీనే ఏదైనా చేస్తుందని ఆశించారు. కానీ.. తమ ఆశలకు.. ఆశయాలకు భిన్నంగా కాషాయ పార్టీ ఉందని చాలా గుర్రుగా ఉన్నారు. అదే బీజేపీ పాదయాత్రలో బయట పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.రాజధాని రైతులు ఉద్యమించిన తొలి నాళ్లల్లో కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు బీజేపీ నేతలు కలిసి సంఘీభావం తెలియజేశారు. అప్పటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లీడ్‌ తీసుకునేందుకు చూశారు. ఆ ఉద్యమాన్ని బేస్‌ చేసుకుని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. అయితే రైతులు ఆశించిన స్థాయిలో ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాల నుంచి మద్దతు లేదనే భావన వారిలో బలంగా పాతుకుపోయింది. ముఖ్యంగా రాజధాని అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని కేంద్రం చేసిన ప్రకటనలు కావచ్చు..

 

వివిధ సందర్భాల్లో సోము వీర్రాజు, జీవీఎల్‌, విష్ణువర్దన్‌ రెడ్డి వంటి నేతలు చేసిన కామెంట్స్‌ కావొచ్చు.. స్థానిక రైతులకు ఆగ్రహం కలిగించాయి. అప్పట్లో రాజధాని రైతులకు అండగా పాదయాత్ర చేద్దామని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ భావించినా.. మిత్రపక్షంగా ఉన్న బీజేపీనే ఆయన ప్రయత్నాన్ని అడ్డుకుందనే ప్రచారం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజధాని ప్రాంతంలో పర్యటించాలని భావించినా.. దానినీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అడ్డుకుందనే చర్చ సాగింది. ఇవన్నీ రాజధాని రైతుల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట.ఆ తర్వాత బీజేపీ గొంతు సవరించుకుని ఒకే రాజధాని అనే నినాదాన్ని టేకప్‌ చేసినా.. ఇక్కడి రైతులకు అంతగా కనెక్ట్‌ కాలేదు. ఈ ప్రాంతంలో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ GVL గట్టిగా డిమాండ్ చేసి.. రాజధాని రైతులను కలిసి మాట్లాడారు. తర్వాత దానిని అడ్వాంటేజ్‌గా మార్చుకుని స్థానిక నాయకత్వం ముందుకు తీసుకెళ్ల లేకపోయింది. అందుకే రాజధాని గ్రామాల్లో చేపట్టిన పాదయాత్రలో వీర్రాజుకు చుక్కెదురైందని అభిప్రాయ పడుతున్నారు. బీజేపీపైనా.. సోము వీర్రాజు వైఖరిపైనా తమలో ఉన్న అభిప్రాయాన్ని ఆయన ముఖం మీదే అడిగేశారు. దాంతో కమల నాథులు కంగుతిన్నారు.తాజా ఘటన తర్వాత బీజేపీ కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. రాజధాని రైతులకు బీజేపీలోని ఏయే నేతలపట్ల సాఫ్ట్‌ కార్నర్‌ ఉందో.. వారితో ఎక్కువగా పర్యటనలు చేపడితే బాగుంటుందని లెక్కలేస్తున్నారట. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు చర్చల్లోకి వచ్చిందట. గతంలో ఆయన సంఘీభావ ఉద్యమాలు చేసి ఉండటంతో.. ఆయన ఫీల్డ్‌లోకి వస్తే ప్రతిఘటన ఉండబోదని అనుకుంటున్నారట. మొత్తానికి జనంతో జాగ్రత్తగా ఉండాలని తాజా ఘటనతో కమలనాథులకు గట్టిగానే బోధపడినట్టు ఉంది.

 

Tags: Peasants whispering on the lotus

Leave A Reply

Your email address will not be published.