పింఛన్లు పక్కదారి (అనంతపురం)

Pensions sideways (Ananthapur)

Pensions sideways (Ananthapur)

Date:09/10/2018
అనంతపురం  ముచ్చట్లు:
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. నగర పరిధిలోని 22,800 పింఛన్లు ఉన్నాయి. వీటిలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లు కలిపి నెలకు రూ.2.4 కోట్ల వరకు నిధులు మంజూరవుతున్నాయి. ఆయా డివిజన్లలో వీఆర్వోలు, ఇతర సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. యంత్రాల్లో పంపిణీదారుడి వేలిముద్ర, పింఛను తీసుకునే వారి వేలిముద్రను కూడా వేశాక పింఛను తీసుకున్నట్లు అవుతుంది. అయితే చాలా మంది వృద్ధుల వేలిముద్రలు ఆయా యంత్రాల్లో సరిగ్గా నమోదు కావడం లేదు. దీంతో వారికి వీఆర్వో తన వేలి ముద్రతోనే పంపిణీ చేసే వెసులుబాటు ఉంది. కాకపోతే ట్యాబ్‌లో ఆ పింఛనుదారుడి ఫొటోని తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఇలా వేలిముద్ర పడకపోయినా పింఛను ఇచ్చే అవకాశాన్ని కొందరు సొమ్ము చేసుకొని పెద్దఎత్తున నగదు కాజేస్తున్నారు.
ఇటీవల నగరపాలిక పరిధిలో పనులు లేకపోవడం, నగరపాలిక కమిషనర్‌ పనుల విషయంలో కచ్చితత్వాన్ని పాటిస్తుండటంతో.. కొందరు కార్పొరేటర్లు ఈ పింఛన్ల అక్రమ సొమ్ము ద్వారా ప్రతి నెలా ఆదాయం ఉండేలా చూసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని డివిజన్లలో నెలకు సగటున రూ.30-40 వేల వరకు ఇలా దోచేస్తుండగా, కొన్నిచోట్ల అత్యధికంగా రూ.70-80 వేల వరకు కూడా జేబుల్లో వేసుకుంటున్నట్లు సమాచారం. రెండు, మూడు చోట్ల రూ.లక్షకు తక్కువ కాకుండా ఈ రాబడి ఉండేలా చూసుకుంటున్నట్లు తెలిసింది. దీనిపై అధికారులకు తెలిసినా సరే చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక నెలలో పింఛన్లు తీసుకోవడానికి లబ్ధిదారులు రాకపోతే ఆ మిగిలిన మొత్తాన్ని వెనక్కి జమచేయాలి. అయితే నగరంలో పెద్దమొత్తంలో ఈ సొమ్ము మిగలాల్సి ఉండగా, నామమ్రాత మిగులు చూపిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా నగర పరిధిలో ప్రతి నెలా రూ.6-7 లక్షల వరకు పింఛన్ల సొమ్ము ప్రతి నెలా మిగులుతోంది. ఆయా డివిజన్లలో చాలా కాలంగా ఒకే వ్యక్తి పింఛన్లు పంపిణీ చేస్తున్న తీరుపై విమర్శలు వస్తుండటంతో ఇటీవలే మార్పులు చేశారు. ప్రతి మూడు నెలలకు ఓసారి పంపిణీదారులకు సంబంధించి లాటరీ వేసి, వారికి వేర్వేరు డివిజన్లు మారుస్తున్నారు. దీంతో ప్రతి నెలా మిగులుతున్న పింఛన్ల మొత్తం రూ.24-26 లక్షలకు పెరిగింది.
అయినా సరే ఇంకా పెద్దమొత్తంలోనే అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం.పింఛన్ల అక్రమాల్లో కొందరు కార్పొరేటర్లు అంతా తామై చూసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దాదాపు 15 డివిజన్లలో ఈ దోపిడీ అత్యధికంగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై నగరపాలిక అధికారులకు, అటు కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు వెళ్లినా సరే చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నెలలో పింఛన్ల పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో.. పక్కాగా పరిశీలన జరిపితే ఇంత కాలం ఎంత మేరకు దోచేశారనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Tags:Pensions sideways (Ananthapur)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *