శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వివిధ రాష్ట్రాల కళా బృందాలతో ప్రదర్శన – టీటీడీ జేఈవో సదా భార్గవి
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వాహనసేవలలో దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, 2023 శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా అలరించేలా ప్రముఖ కళాకారులతో సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని ఉత్తమ కళా బృందాలకు స్వామివారి వాహనసేవలలో ప్రదర్శనలు ఇచ్చేందుకు అహ్వానించాలన్నారు. తిరుమల నాదనీరాజనం వేదిక, ఆస్థాన మండపంలలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు అత్యద్భుతంగా ఉండాలన్నారు.తిరుపతిలోని మహతి కళాక్షేత్రం,

అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసే భక్తి సంగీత కార్యక్రమాలు పురప్రజలను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. తిరుమలకు వచ్చే కళాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన రవాణా, వసతి సౌకర్యాలు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వెనుకబడిన పేదవర్గాలకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని డిపిపి అధికారులను జేఈవో ఆదేశించారు.ఈ సమావేశంలో డిపిపి ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజగోపాల రావు, డిపిపి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనంద తీర్థా చార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డా. విబీషణ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:Performing with art troupes from different states during Srivari Brahmotsavam – TTD JEO Sada Bhargavi
