తెగుళ్ల తంటా..

Pests

Pests

Date:09/10/2018
గుంటూరు ముచ్చట్లు:
పెరిగిన పెట్టుబడి ఖర్చులతో రైతులు ఇప్పటికే సతమతమవుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి పంటలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. అన్నదాతలకు ఈ సమస్యలు చావన్నట్లు పలు ప్రాంతాల్లో తెగుళ్లు విజృంభిస్తున్నాయి. పంటలపై దాడులు చేస్తున్నాయి. దీంతో రైతులు ఆవేదనలో కూరుకుపోయారు. తెలుగురాష్ట్రాల్లో రైతులు తెగుళ్ల బారి నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు అగచాట్లు పడుతున్న పరిస్థితి ఉంది. ఏ మందు పిచికారీ చేస్తే సమర్ధవంతమైన ఫలితం ఉంటుందో చాలామందికి తెలీడంలేదు.
దీంతో దుకాణాదారులు సూచించిన మందులనే వాడుతున్నారు. కొన్నిచోట్లు దుకాణాదారులు రైతులకు రెండుమూడు రకాలు అంటగడుతున్నారు. దీంతో కర్షకులు ఆర్ధికంగా నష్టపోతున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోనూ ఈ సమస్య కనిపిస్తోందన్న వార్తలొస్తున్నాయి. ప్రధానంగా వరి రైతులు తెగుళ్లను నివారించేందుకు నానాపాట్లు పడుతున్నారని అంటున్నారు. సీజన్ మారడంతో వరి పంటను తెగుళ్లు ఆశించాయి. ఖరీఫ్‌ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదుకాలేదు. ఎండలు విపరీతంగా ఉన్నాయి. దీంతో పంటలకు తెగుళ్లు సోకాయి. దీంతో వీటిని వదిలించుకుని పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు తెగుళ్ల బారిన పడినట్లు కర్షకులు చెప్తున్నారు. పలు ప్రాంతాల్లో వరి దుబ్బులు ఎర్రగా మారాయి. మరికొన్నిచోట్ల పంట ఎదుగుదల సరిగా లేదు. దీంతో రైతులు పెద్ద మొత్తంలోనే పురుగు మందులు పిచికారి చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం ఉండడంలేదని పలువురు అంటున్నారు. ఇప్పటికే పంటల కోసం పెద్దమొత్తంలో ఖర్చు పెట్టారు. తెగుళ్లు నివారణకూ భారీగానే ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం ఉండకపోవడంతో రైతులు డీలా పడుతున్నారు. ఇక కౌలు రైతుల కష్టాలు మరోలా ఉన్నాయి. కష్టానికి తగ్గ ఫలితం లభించేలా లేదని వారు వాపోతున్నారు. తెగుళ్ల బారిన పడిన పంటతో ఏమి చేయాలో తెలీడంలేదని తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి వ్యవసాయ శాఖ అధికారులు తగిన సూచనలు, సలహాలు రైతులకు ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
కానీ అలాంటిదేమీ చేయడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. పైరు ఎదుగుదల రాకపోతే దిగుబడులు తగ్గిపోతాని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అదే జరిగితే ఆర్ధికంగా రైతులంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. సత్వరమే జిల్లాలో పంటల స్థితిగతులు వ్యవసాయాధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే జింక్ లోపం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. జింకు ద్రావణం పిచికారీ చేస్తే ఫలితం ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనా ఈ సమస్య పరిష్కరించేందుకు వ్యవసాయ విభాగమే చొరవ తీసుకోవాలి. రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చి పంటలు కాపాడుకునేలా అండగా ఉండాలి.
Tags:Pests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed