పెట్రో వాత తప్పదా….

Date:18/05/2018
ముంబై  ముచ్చట్లు:
పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు మరో రూ.4 నుంచి 5 వరకు పెరిగే వీలుందన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో సామాన్యుడి జేబుకు పెట్రో మంటల సెగ గట్టిగానే తగలనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్నా.. కేవలం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కారణంగానే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరల జోలికి వెళ్ల లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దూసుకుపోతున్నాయి. గురువారం బ్యారెల్ బ్రెంట్ ఆయిల్ ధర 80 డాలర్లను అధిగమించింది. 2014 నవంబర్ నుంచి చూస్తే ఇదే తొలిసారి. ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి అమెరికాను తప్పించేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం, వెనిజులాలో చమురు ఉత్పత్తి పడిపోవడం, ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించుకోవడం వంటి అంశాలు గ్లోబల్ క్రూడాయిల్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. జూలైలో డెలివరీ కోసం బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ధర బ్యారెల్‌కు 80.18కి చేరినట్లు వివరించింది. మరోవైపు ఈ ప్రభావం భారత్‌సహా ప్రపంచ చమురు దిగుమతి దేశాలపై పెద్ద ఎత్తున కనిపిస్తున్నది.19 రోజులపాటు విరామం ఇచ్చిన కంపెనీలు.. ఇప్పుడు ఎడాపెడా బాదేస్తున్నాయి. రోజుకింత పెంచుతూ నష్టాలను భర్తీ చేసుకుంటున్నాయి. సోమవారం నుంచి మొదలైన పెట్రో వాతలు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర మరో 22 పైసలు ఎగిసి రూ.75.32ను తాకగా, డీజిల్ ధర కూడా 22 పైసలు ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రూ.66.79ని చేరింది. ఈ నాలుగు రోజుల్లో పెట్రోల్ 69 పైసలు, డీజిల్ 86 పైసలు చొప్పున పెరిగాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 23 పైసలు పెరిగి రూ.79.78కి, డీజిల్ 24 పైసలు అందుకుని రూ.72.60కి చేరాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.4-4.55, డీజిల్ ధర రూ.3.5-4 మేర ఎగబాకడం ఖాయమంటున్నాయి పలు బ్రోకరేజ్ సంస్థలు. కర్ణాటక ఎన్నికల దృష్ట్యా గత నెల 24 నుంచి ఈ నెల 13 వరకు పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచలేదు. ఇదే వ్యవధిలో బ్యారెల్ పెట్రోల్ అంతర్జాతీయ ప్రామాణిక రేటు 78.84 డాలర్ల నుంచి 82.98 డాలర్లకు, డీజిల్ 84.68 డాలర్ల నుంచి 88.93 డాలర్లకు ఎగిసింది. దీంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సంస్థలకు సుమారు 500 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోతుండటం కూడా పెట్రో ధరల పెంపునకు దారితీస్తున్నది. ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. రూపాయి విలువ పతనం దిగుమతులను భారం చేస్తుండగా, ఈ భారాన్ని వినియోగదారులపైనే చమురు సంస్థలు మోపుతున్నాయి. ఫలితంగా మున్ముందు ధరల భారం తీవ్రతరం కాకతప్పదని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం పైపైకే: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల వరుస ధరల పెంపు నిర్ణయంతో సామాన్యులపై పెను భారం పడుతున్నది. రవాణా చార్జీలు, ముఖ్యంగా సరకు రవాణా చార్జీలు పెరిగి ఆహార, ఇతరత్రా ద్రవ్యోల్బణాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ ప్రభావం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యసమీక్షపైనా ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధరాఘాతాన్ని అదుపులో పెట్టేందుకు వడ్డీరేట్లను పెంచితే.. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు నగదు లభ్యత కష్టమవుతుందని అంటున్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవన వ్యయం కూడా అధిక ఇంధన ధరలతో ప్రభావితం అవుతుందన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
Tags:Petro Vata is wrong ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *