యోగాతో శారీరక, మానసిక వికాసం- టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి
– అత్మ పరమాత్మలో విలీనం కావడానికి ఏకైక సాధనం యోగా
తిరుపతి ముచ్చట్లు:
ఆధునిక జీవన విధానంలో యోగా సాధన చేయడం ద్వారా శరీరం, మనసుతోపాటు భావోద్వేగాలను నియంత్రించవచ్చని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని టీటీడీ ఈవో, ఎస్వీ వేదిక్ యూనివర్శిటీ ఉప కులపతి శ్రీ ఎవి.ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తిరుపతి శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్శిటీ ప్రాంగణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భగవంతుడు నిర్దేశించిన కర్మలు చేయడానికి ఆత్మ భౌతిక శరీరాన్ని ఉపయోగించుకుంటుందని, దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా ఉపయోగపడుతుందని చెప్పారు. జీవిలోని ఆత్మ పరమాత్మలో ఏ విధంగా విలీనం అవుతుందో భగవద్గీతలో వివరించబడిందన్నారు. జనన, మరణాల మధ్య జరిగే జీవన చక్రంలో యోగా ద్వారా పరిపూర్ణమైన శక్తి సిద్ధిస్తుందని చెప్పారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, మానసిక ప్రశాంతతకు, కోర్కెలు జయించడానికి, మెదడు, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి యోగా ఏవిధంగా ఉపయోగపడుతుందో ఈవో వివరించారు.తిరుమల నాదనీరాజనం వేదికపై ప్రతిరోజూ యోగా దర్శనం కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ ప్రవచనాలకు ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన వస్తోందన్నారు. యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారం అని, ఇది ఆధ్యాత్మిక సాధనకు చక్కగా తోడ్పడుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం త్వరలో వారంలో ఒక రోజు నాదనీరాజనం వేదికపై యోగ దర్శనం కార్యక్రమంలో ప్రవచనాలకు బదులు ఎస్వీ వేదిక్ యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్థులతో యోగా ఆసనాలను వేయించే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
అనంతరం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ కుప్పా విశ్వనాథశర్మ మాట్లాడుతూ ఈ భూమి మీద 47 రకాల నాగరికతలు ఉన్నట్లు, అందులో 46 రకాల నాగరికతలకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యాలు లేవని, ప్రస్తుతం ధర్మ బద్ధంగా ఉన్న ఒక నాగరికత మాత్రమే భూమిపై ఉన్నట్లు తెలిపారు. యోగాకు తండ్రి శివుడని, ఆధునిక తండ్రి పతంజలి అని గుర్తు చేశారు. మానవ శరీరం పంచ భూతాలతో నిర్మితమై ఉంటుందని, యోగ శాస్త్రాన్ని, మంత్ర శాస్త్రాన్ని మిళితం చేసి మానవ జీవితాన్ని సఫలం చేసుకోవచ్చని వివరించారు.అనంతరం ఎస్వీ వేదిక్ యూనివర్శిటీ ప్రధాన యోగాచార్యులు రామనారాయణ పలు యోగాసనాలను ఈవో, అధ్యాపకులు, విద్యార్థులచే వేయించారు.ఈ కార్యక్రమంలో ఎస్వీ వేదిక్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ పి.విశ్వనాథ్, డీన్ ఫణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:Physical and Mental Development with Yoga – TTD Evo AV Dharmareddy