క్రిష్ 2 తరహాలో పైలెట్

Date:13/05/2019
ముంబై ముచ్చట్లు:
క్రిష్2 సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది. ముంబయి ఎయిర్‌పోర్టులో దిగాల్సిన విమానానికి ముందు టైర్లు తెరుచుకోకపోవడంతో అందరూ ప్రాణలు అరచేతిలో పెట్టుకుంటారు. ఈ విషయాన్ని తెలుసుకున్న క్రిష్ గాల్లో ఎగురుతూ విమానం వద్దకు చేరుకుని ఆ టైర్లు తెరుచుకోవడంలో సాయం చేసి విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేసి అందరినీ కాపాడతాడు. ఆదివారం మయన్మార్‌లో ఓ విమానానికి ఇలాంటి సమస్యే వచ్చింది. కానీ క్రిష్ రాలేదు. ఆ విమానం పైలటే చాకచక్యంతో దాన్ని ల్యాండ్ చేసి అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. మయన్మార్‌లో 89 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ప్రయాణిస్తున్న ఎంబ్రేయర్‌-190 విమానం ల్యాండింగ్‌ గేర్‌లో ఆదివారం లోపం తలెత్తింది. పైలట్‌ ఎంత ప్రయత్నించినా గేర్‌ తెరచుకోలేదు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విమానాశ్రయ అధికారులు కూడా చేతులెత్తేశారు. ఇక ఆ విమానంలో అందరికీ చావు తప్పదని అంతా నిర్ధారించుకున్న సమయంలో పైలట్ హీరోలా మారాడు.
తన అనుభవాన్ని అంతా రంగరించి అత్యంత చాకచక్యంతో ముందు చక్రాలు లేకుండానే మాండలే విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశాడు. రన్‌వేపై విమానం ముందు భాగం నేలపై రాసుకుంటూ వెళ్లడంతో నిప్పులు చెలరేగాయి. అయినప్పటికీ పైలట్ ధైర్యం సడలకుండా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా విమానాన్ని సురక్షితంగా దించాడు. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారితో పాటు సిబ్బంది కూడా బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ విమానం ల్యాండ్ అవుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పైలట్ నిజమైన హీరో అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Tags: Pilot on the crush 2 scale

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *