ఓట్లు చీల్చే దిశగా గులాబీ అడుగులు…
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయా? ఇంచుమించుగా రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచిన, తెలంగాణ అస్తిత్వ వాదం తెరమరుగవుతోందా? ఆంద్ర పాలకులు, ఆంధ్ర రాజకీయ నాయకుల పట్ల ఉద్యమ కాలంనాటి వ్యతిరేకత కరిగిపోతోందా? అప్పటి బద్ద శత్రువులే ఇప్పడు అధికార పార్టీకి ఆప్త మిత్రులు అవుతున్నారా? అంటే, అటునుంచి అవుననే సమాధానమే వస్తోంది. సమైక్యవాదానికి ప్యాంటూ, షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉండే, ఉండవల్లి అరుణ కుమార్’ ను ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమనేత కేసేఆర్ ప్రగతి భవన్’ కు ప్రత్యేకంగా ఆహ్వానించి, ఆయనతో రాజకీయ చర్చలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనమే అయింది. ఈ నేపధ్యంలో. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, మేధావి వర్గాలో ఇదే చర్చ జరుగుతోంది. నిజానికి, ఆంధ్రా తెలంగాణ మధ్య ఉద్యమం గీసిన విభజన రేఖ చెరిగి పోతోందనే అభిప్రాయానికి బలాన్ని చేకూర్చే అంశాలు చాలానే ఉన్నాయని అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు. అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి కూడా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా పెట్టుబడి దారులకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతామనే చెపుతూ వచ్చారు. అయితే, అప్పుడు ఉద్యమ అవసరాల దృష్ట్యా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారని సరిపెట్టుకున్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అక్షరాలా అదే పంధాలో పయనిస్తోంది…అందుకే ప్రభుత్వ కాంట్రాక్టులలో, ఇతరత్రా పెట్టుబడుల విషయంలో తెరాస ప్రభుత్వం ఆంధ్రా పెట్టుబడి దారులకే ప్రాధన్యత ఇస్తోందనే విమర్శలు వినవస్తున్నాయి. అయితే ఇదేదో హఠాత్తుగా, అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదు. నిజానికి, 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే, కేసీఆర్, తెలంగాణ భవిష్యవాణిని విష్పష్టంగా వినిపించారు. ‘తెరాస ఇక ఎంత మాత్రం ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీ’ అని ప్రకటించారు. ఇక అక్కడి నుంచి ఏమి జరిగిందన్నది చరిత్ర .. అనేక మంది ఉద్యమకారులు ఆరోపిస్తున్న లేదా విశ్లేస్తున్న విధంగా తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళు ఏవీ మిగలకుండా తుడుచుకుంటూ వస్తున్నారు.రాజకీయ పునరేకీకరణ పేరున తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసిన, ఒకప్పుడు తమ నోటితోనే తెలంగాణ ద్రోహులగా ముద్ర వేసిన అందరినీ చేరదీశారు.

అందలం ఎక్కించారు. అందుకే ఈరోజున్న మంత్రి వర్గంలో సగం మందికి పైగా ‘తెలంగాణ ద్రోహులే’ ఉన్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని కూడా సమర్ధించుకున్నారు అనుకోండి అది వేరే విషయం. ఇన్నెందుకు, రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్ళలో, ఆంధ్ర కాంట్రాక్టర్ల పుణ్యాన రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు పూర్తయ్యాయి, ప్రగతి భవన నిర్మాణం అయితే ఇంకా వేగంగా పూర్తయిందికానీ,తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల స్థూప నిర్మాణం మాత్రం, అది కూడా ఆంధ్రా కాంట్రాక్టర్ కే కట్ట బెట్టినా, పూర్తి కాలేదు. అలాగే 1200 మంది అమరవీరులలో సగం మందికి కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదు. అందుకే ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ స్పూర్తిని భూస్థాపితం చేసి, తమ కుటుంబ పాలనను సుస్థిరం చేసుకునేందుకు దిశగా అడుగులు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే 1200 మంది అమర వీరుల త్యాగాలను ఏనాడూ స్మరించని, తెరాస నాయకులు, ఒక్క కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని, ఆయన చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారనే అర్థ సత్యాన్ని పెద్దగా ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.అయితే, విమర్శల దారిన విమర్శలు సాగుతున్నా, ముఖ్యమంత్రి అడుగులు ముందుకే పడుతున్నాయి. అదలా ఉంటే, ఇప్పుడు ఏపీతో రాజకీయ సంబంధాలను పెనవేసుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్ననాయని అంటున్నారు. అయితే, ఇది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగమే కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తును బూచిగా చూపించి, సెంటిమెంట్ ను క్యాష్ చేసుకున్న కేసీఆర్, ఇప్పడు రూటు మార్చారని అంటున్నారు.ప్రభుత్వ వ్యతిరేకత, తెలంగాణ సెంటిమెంట్ ను ఎప్పుడోనే అధిగమించిన నేపధ్యంలో ఇప్పుడు కేసీఆర్, సెంటిమెంట్ ను పక్కన పెట్టి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు ఏపీ రాజకీయాలను వ్యూహాత్మకంగా ఉపయోగించు కుంటున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఉండవల్లితో భేటీ అయినా, షర్మిల పాదయాత్రను సాఫీగా నడిపిస్తున్నా, పవన్ కళ్యాణ్ ను తెలంగాణ ఎన్నికల బరిలో దింపుతున్నా, అన్నిటి లక్ష్యం అదేనని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే అని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఏ చిన్న ఆందోళన చేపట్టినా, తెరాస ప్రభుత్వం అడుగడునా అవరోధాలు కల్పిస్తుంది. హౌస్ ఆరెస్టులతో నేతలను నిర్భందిస్తుంది.నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుంది.ఒక్క రేవంత్ రెడ్డి పైనే వందకు పైగా కేసులు ఉన్నాయంటే, పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చును. అలాగే, బండి సంజయ్ పాదయాత్రలో అనేక అవరోధాలు సృష్టించింది. చివరకు ఆయన కార్యాలయంలో దీక్ష చేపట్టినా, పోలీసులు తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేశారు. కానీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సాగిస్తున్న ప్రజాప్రస్థానం పాద యాత్రకు మాత్రం పోలీసులు ఎక్కడా అభ్యంతరం చెప్పరు. వెనకటికి వైఎస్సార్ పాదయాత్ర చేసిన సమయంలో, అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెస్సార్, ‘నడిచింది వైఎస్ అయినా, నడిపించింది కేవీపీ’ అని కితాబు నిచ్చారు. అలాగే, ఇప్పడు నడుస్తోంది షర్మిల అయినా నడిపిస్తోంది, తెరాస నాయకత్వమే అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అలాగని ఆమె తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యంత్రి కేసీఆర్ ను తక్కువ విమర్సిస్తున్నారా, అంటే లేదు. ప్రగతి భవన్ స్క్రిప్ట్’ను ఫాలో అవుతూ ఘాటు విమర్శలే చేస్తున్నారు. అయినా, అరెస్టులు, అవరోధాలు కాదు కదా, కనీసం అధికార పార్టీ నుంచి రియాక్షన్ రావడం లేదు ..తాజాగా ఖమ్మ జిల్లాలో పాద యాత్ర చేస్తున షర్మిల ,”రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు.16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిన ఘనత కేసీఆర్ దే. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన 16 మంది ముఖ్యమంత్రుల కన్నా.. ఒక్క కేసీఆర్ చేసిన అప్పులే ఎక్కువ.
తెరాస బ్యాంకు ఖాతాలో రూ.860 కోట్లు ఉన్నాయి. వడ్డీ రూపంలో ఇప్పటికే రూ.25 కోట్లు వచ్చిందని ఆ పార్టీ చెబుతుంది. మరి పార్టీ దగ్గరే ఇన్ని వందల కోట్లు ఉంటే.. పార్టీ అధ్యక్షుడి దగ్గర, ఆయన కుటుంబ సభ్యుల దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి” అంటూ విమర్శలు గుప్పించారు. ఇలాంటి విమర్శలు కాంగ్రెస్, బీజేపీ నాయలు ఎవరు చేసినా, తెరాస మంత్రులు, నాయకులూ కస్సున లేస్తారు. కానీ, షర్మిల ఎంత ఘాటు విమర్శలు చేసిన అధికార పార్టీ నుంచి ప్రతిస్పందన లేదు. చివరకు జిల్లా మంత్రి పువ్వాడను పొట్టు పొట్టు తిట్టినా పువ్వాడ సహా ఎవరూ రియాక్ట్ కాలేదు. అందుకే, ఒకప్పుడు జగనన్న విడిచిన బాణం అంటూ పాదయాత్ర సాగించిన షర్మిల, ఇప్పుడు కేసీఆర్ విడిచిన బాణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.అదే విధంగా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తామని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం వెనక కూడా తెరాస వ్యూహమే ఉందని అంటున్నారు. ఇటీవల నల్గొండ జిల్లాలో పర్యటించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తామని తెలిపారు. ఏపీలో బలంగా ఉన్న తెలుగు దేశం, వైసీపీలే తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్న సమయంలో, ఆంద్ర ప్రాంతానికి చెందిన, అక్కడే దిక్కు దివానం లేని నాయకులు, పార్టీలు తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతున్నాయి అంటే, ఈ వ్యూహం వెనక ఎవరున్నారో … అర్ధం చేసుకోవడం కష్టం కాదని పరిశీలకులు అంటున్నారు.
Tags:Pink steps towards splitting votes …
