కాంగ్రెస్ లో  గులాబీ ముళ్లు…?

హైదరాబాద్ ముచ్చట్లు:
 
జగ్గారెడ్డి ఉదంతం మరోసారి టీ-కాంగ్రెస్‌ను వార్తల్లో నిలిపింది. పార్టీలో తనకు ఏ మాత్రం ప్రాధాన్యం లభించడం లేదని, పైగా కోవర్ట్‌ గా ముద్ర వేసి బయటకు పంపే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఇటీవల రాజీనామాకు సిద్ధమయ్యారు. పలువురు సీనియర్ నేతలు బతిమాలినా తన నిర్ణయాన్ని మార్చుకోబోవడం లేదని ప్రకటించారు. పార్టీ అధినేత్రి సోనియాకు, యువనేత రాహుల్‌కు ఈ సందర్భంగా ఆయన మూడు పేజీల లేఖ రాశారు. పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచీ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిని దుయ్యబట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురిని నియమించినా.. ఎవరికీ కనీస ప్రయారిటీ కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమాలు, సభల నిర్వహణకు సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరతానంటూ కాంగ్రెస్ నేతలే టీవీ చర్చల్లో చెబుతున్నారన్నారు. పార్టీ ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయిందని వాపోయారు. పరిస్థితిని అధిష్టానం మార్చకపోతే తానే పార్టీని వదిలి వెళ్లిపోతానని హెచ్చరించారు. ఢిల్లీ స్పందన కోసం ఎదురుచూస్తున్నానని, పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.జగ్గారెడ్డి ఇలా పీసీసీ చీఫ్‌పై తిరగబడడం ఇదే మొదటిసారి కాదు.
 
రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన రోజు నుంచీ రేవంత్‌పై ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనేవున్నారు. ఆయనే కాదు.. సీనియర్ నేతలు చాలా మంది ఇదే బాటలో నడుస్తున్నారు. రేవంత్ ఉన్నంతవరకు తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటిస్తే, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కూడా రేవంత్‌పై తన ఆగ్రహాన్ని ఎన్నోమార్లు వెళ్లగక్కారు. మరో నేత వీహెచ్ కూడా రేవంత్‌పై వ్యక్తిగత దూషణకు దిగారు. చంద్రబాబుకు కోవర్టుగానే కాంగ్రెస్‌లోకి వచ్చాడన్నారు. ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, మధు యాష్కీ, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, జానారెడ్డి వంటి ఇతర సీనియర్లు నేరుగా రేవంత్‌ను విమర్శించకపోయినా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. పీసీసీ చీఫ్ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం మల్లు రవి, పొన్నాల లక్ష్మయ్య, కొండా దంపతులు, ద్వితీయ శ్రేణి రాష్ట్ర నాయకత్వం, జిల్లా స్థాయి లీడర్లు, టీడీపీ నుంచి వెంట వచ్చిన సీతక్క లాంటివాళ్లు మాత్రమే రేవంత్ పిలుపులకు స్పందిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన తర్వాత అసంతృప్త నేతలను ఆయన కలిసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇప్పటికీ గాంధీభవన్  వెనకటి కళ సంతరించుకోలేదు.నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పతనం ఆరంభమైంది 2009 డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన తర్వాతేనని చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని ఆయన చెప్పిన వెంటనే ఆంధ్ర, రాయలసీమకు చెందిన కాంగ్రెస్ సహా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామాల పర్వానికి తెరలేపారు. పెద్దఎత్తున ఆందోళనలు సాగించారు. దాంతో ఖంగుతిన్న మన్మోహన్ ప్రభుత్వం వెనక్కి తగ్గి అన్ని వర్గాలతో చర్చలు జరిపి నివేదిక ఇవ్వడానికి శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఏడాదిలోగానే ఈ కమిటీ నివేదిక సమర్పించినా సుమారు మూడున్నరేళ్ల పాటు విభజన విషయాన్ని తేల్చకుండా కాంగ్రెస్ హైకమాండ్ సాగదీసింది. ఈ కాలంలోనే ఇక్కడ కాంగ్రెస్ ప్రతిష్ఠ రోజురోజుకు ఘోరంగా దిగజారింది.
 
ప్రత్యేక రాష్ట్రానికి తాము సుముఖమంటూ ప్రకటించి ఆంధ్ర ప్రాంతంలో పార్టీ తన ఉనికిని కోల్పోతే, ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా సాగదీయడం మూలంగా తెలంగాణలోనూ బాగా దెబ్బతిన్నది. పైగా కేంద్ర పార్టీ సరైన డైరెక్షన్ ఇవ్వని స్థితిలో టీ-కాంగ్రెస్ నేతలు ఇష్టమున్నట్లు వ్యవహరించడంతో వాళ్లందరూ ప్రజల దృష్టిలో తెలంగాణ ద్రోహులైపోయారు. వరంగల్‌లో కొండా సురేఖ, రాజయ్య, బలరాం నాయక్, హైదరాబాద్‌లో దానం నాగేందర్ వంటి నేతలు ఆందోళనకారులపై దాడికి దిగడంతో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.కేంద్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అధికారం తనదే అయినా, చట్టసభల్లో మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ అధిష్టానం విభజన వ్యవహారాన్ని మిస్‌హ్యాండ్లింగ్ చేసింది. విభజన సాఫీగా జరిగేలా చూసేందుకని రోశయ్య స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం చేస్తే, ఆయన ప్లేటు ఫిరాయించారు. తెలంగాణ ప్రజల హృదయాలు గాయపడేలా ఉన్మాదపూరిత వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా ఉద్యమం మరింత ఉచ్ఛస్థాయికి చేరింది. చివరకు అధిష్టానం తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదముద్ర వేయక తప్పలేదు. బిల్లుపై చట్టసభల్లో ఓటింగ్ సందర్భంగా లగడపాటి వంటి ఎంపీలు వ్యవహరించిన తీరు ఈ వ్యవహారంలో క్లైమాక్స్ గా చెప్పవచ్చు. అప్పటికి ఇరుప్రాంతాల్లో ఆ పార్టీని ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. అందుకే 2014 ఎన్నికల్లో నవ్యాంధ్రలో కనీసం ఖాతా కూడా తెరువలేక చతికిలపడితే, రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో కేవలం 19 స్థానాలనే గెలువగలిగింది.
 
2014 జూన్ నుంచి 2018 డిసెంబర్ వరకు నాలుగేళ్లు టీ-కాంగ్రెస్‌ రాష్ట్రంలో పెద్దగా చేసిందేమీ లేదు. ముందు పొన్నాల లక్ష్మయ్య, ఆ తర్వాత ఉత్తమ్‌ ఆ పార్టీకి శల్య సారథ్యం వహించారు. కేడర్‌లో నిరాశ, నిస్పృహలు రాజ్యమేలాయి. పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి ఫిరాయించారు. 2017 చివరన రేవంత్ తదితరులు టీడీపీ నుంచి వచ్చిన తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడింది. ఆ కాలంలోనే చెప్పుడెక్కువ.. చేసుడు తక్కువ.. నిధులు తక్కువ.. అవినీతి ఎక్కువ.. తరహాలో కేసీఆర్ పాలన సాగుతోందనే అభిప్రాయం ప్రజల్లో పెరిగి ప్రభుత్వ వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. రైతుబంధు పథకాన్ని ప్రకటించిన గులాబీ బాస్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లేనాటికి ప్రిపోల్ సర్వేలన్నీ కాంగ్రెస్ గెలుపును అంచనా వేశాయి. అయితే, ఈ పరిస్థితిని ఉపయోగించుకోవడంలో టీ-కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. పైగా, తెలంగాణ ద్రోహిగా పేరుబడిన టీడీపీతో పొత్తు పెట్టుకుని బొక్కబోర్లాపడింది. చంద్రబాబు ఇక్కడికి వచ్చి తనదైన శైలిలో కేసీఆర్‌పై దూషణలకు దిగడం బెడిసికొట్టింది. చివరకు కేవలం 21 స్థానాలతో అవమానకర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహించి ఉత్తమ్ తన పదవికి రాజీనామా చేసినా రెండున్నరేళ్ల పాటు కొత్త చీఫ్‌ను నియమించడంలో కాంగ్రెస్ అధిష్టానం తాత్సారం చేసింది. పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. 2019 జూన్ కల్లా 12 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పంచన చేరి సీఎల్‌పీని టీఆర్ఎస్‌లో కలిపేయడంతో పరువు పోయింది. ఎట్టకేలకు మేల్కొన్న సోనియా, రాహుల్ 2021 జూలైలో రేవంత్‌రెడ్డికి పగ్గాలు అప్పగించారు.అప్పటినుంచీ టీ-కాంగ్రెస్ పరిస్థితి పైన పటారం.. లోన లొటారం.. అన్నట్టుగానే ఉంది. ఓ వైపు రేవంత్ కేసీఆర్ పాలనపై వాడి వేడి బాణాలు సంధిస్తుంటే, మరోవైపు సీనియర్లు ఆయన పైనే తమ దాడిని ఎక్కుపెడుతున్నారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోందని, ఆ పరిస్థితిని కమలనాథులు సక్సెస్‌ఫుల్‌గా వాడుకుని ప్రధాన ప్రతిపక్షంగా మారుతున్నారని గుర్తించడంలో విఫలమవుతున్నారు. పార్టీ ప్రయోజనాలను అటకెక్కించి తమ సొంత ఎజెండాలతో ఎవరికి వారే అన్నట్లు ముందుకు సాగుతున్నారు.
 
అంతర్గత కలహాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. హైకమాండ్ కూడా ఈ క్రమశిక్షణ లేమిపై సత్వర నిర్ణయాలు చేయకుండా సాగదీస్తున్నది. తన చేతులు కట్టేశారనే కినుకతో రేవంత్ కూడా ఒకింత అసంతృప్తిగానే ఉన్నారని, చొరవతో ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారని గాంధీభవన్ వర్గాల సమాచారం.తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ముందస్తు టాక్ జోరుగా నడుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతోందని గ్రహించిన కేసీఆర్ తన అమ్ములపొది నుంచి కొత్త అస్త్రాన్ని బయటకు తీశారు. మోడీపై, కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై పూర్తిస్థాయి యుద్ధాన్నే ప్రకటించారు. మోడీ తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని వరుస ప్రెస్ మీట్లలో, బహిరంగసభల్లో వివరిస్తూ సెంటిమెంటును రగిలిస్తున్నారు. బంగారు భారతం కోసం జాతీయ రాజకీయాల్లోకి వెళతానంటున్నారు. స్టాలిన్, శరద్ పవార్, దేవేగౌడ, ఉద్ధవ్ ఠాక్రే వంటి నేతలతో మాట్లాడుతున్నారు.
తాను కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నానన్న సంకేతాలను పంపుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆయన మూడు లాభాలను ఆశిస్తున్నారు. ఒకటి: తక్షణం కేటీఆర్‌ను సీఎం చేయడం. రెండు: మతతత్వ బీజేపీకి తానే అసలు ప్రత్యామ్నాయమనే భ్రమను ఓటర్లలో కల్పించడం. తద్వారా కాంగ్రెస్ ఓటుబ్యాంకును తనవైపు మళ్లించడం. ఆ రెండు పార్టీలను ప్రజల్లో బకరా చేయడం. మూడు: వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెస్, బీజేపీల్లో ఏదోఒకటి అనివార్యంగా తనకు మద్దతు ప్రకటించే పరిస్థితిని కల్పించడం.కేసీఆర్ విసిరిన ఈ వలలో టీ-కాంగ్రెస్ చిక్కుకుంటుందా? వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి తోకగా మారుతుందా? లేదంటే కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికే కేసీఆర్-మోడీ కలిసి ఈ డ్రామా ఆడుతున్నారని ప్రజల్లో ఎక్స్‌పోజ్ చేయగలుగుతుందా? అంతర్గత పోరు నుంచి అసలు బయటపడుతుందా? ఎవరు టీఆర్ఎస్ పంచన చేరుతారు? ఎవరు కాషాయాన్ని ఆశ్రయిస్తారు? తన డైనమిజంతో రేవంత్ పార్టీకి కొత్త జవసత్వాలు అందిస్తారా? ప్రత్యర్థులను తలదన్నే ఎన్నికల వ్యూహానికి తెరతీస్తారా? అధిష్టానం ఆయనకు ఎంతమేరకు సహకరిస్తుంది? వేచిచూడాలి.
 
Tags:Pink thorns in Congress …?

Leave A Reply

Your email address will not be published.