పల్లెల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్లాన్

Plan to set up CMS cameras in villages

Plan to set up CMS cameras in villages

Date:22/05/2018
మెదక్ ముచ్చట్లు:
సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ఇది పోలీస్‌శాఖ చెబుతున్న మాట. దొంగతనాలు, దోపిడీలు, గొలుసు చోరీలు, హత్యలు, ఇతర నేరాలు జరిగినప్పుడు నిందితుల ఆచూకీ తెలుసుకోవడంలో మూడోకన్ను కీలక పాత్ర పోషిస్తుండడంతో వీటి ఏర్పాటుకు పోలీస్‌శాఖ విస్తృత చర్యలు తీసుకుంటోంది. మెదక్ జిల్లాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.35 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులు రావాల్సి ఉంది. రామాయంపేట పట్టణంలో మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి రూ.10 లక్షలు ఇవ్వగా పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు నిజాంపేట మండలం కల్వకుంటలో ఏఎంసీ వైస్‌ఛైర్మన్‌ కొండల్‌రెడ్డి గ్రామంలో 16 కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లో గ్రామస్థుల సహకారంతో కెమెరాలను బిగించారు. చేగుంట, నార్సింగి మండల కేంద్రాల్లో, వెల్దుర్తి మండల కేంద్రం, మాసాయిపేట, తూప్రాన్‌ పట్టణంలో ప్రధాన రహదారిపై , నర్సాపూర్‌ పట్టణంలో దాతల సహకారంతో పోలీసులు ఏర్పాటు చేయించారు. కౌడిపల్లి, పెద్దశంకరంపేట, మనోహరాబాద్‌, శివ్వంపేట, టేక్మాల్‌, చిన్నశంకరంపేట మండల కేంద్రాల్లో సీసీ టీవీలు బిగించారు.నేను సైతం’ పేరుతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహిస్తోంది. జిల్లాలోని ఆయా ఠాణాల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికి తక్కువ సంఖ్యలో ఉండడంతో పోలీస్‌శాఖ ‘నేను సైతం’ పేరుతో ముందుకు వస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఆయా మండల కేంద్రాలు, పట్టణాల్లో ప్రధాన కూడళ్లు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండేచోట ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు ప్రతి గ్రామంలో రాకపోకలు జరిగే ప్రాంతాల్లో బిగించాలని ఎస్పీ చందనాదీప్తి పోలీస్‌ సిబ్బందిని ఆదేశించారు. నేను సైతం ద్వారా ప్రజలను ఇందులో భాగస్వాములను చేసి సాధ్యమైనంత వరకు నేరాలను నియంత్రించేందుకు పోలీస్‌శాఖ ఈ చర్యలు చేపట్టింది. మూడోకన్ను బిగింపునకు ప్రజలు, దాతల సహకారంతో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో గత ఏడాది డిసెంబరు వరకు పోలీస్‌శాఖ తరపున 63, సామాజిక పరంగా 290 కెమెరాలను బిగించారు. తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు కెమెరాల బిగింపు విషయంలో ప్రత్యేక దృష్టి సారించగా, ప్రస్తుతం వాటి సంఖ్య మరింత పెరిగింది. నేను సైతం కార్యక్రమం ద్వారా రాబోయే రోజులలో మరిన్నిచోట్ల ఏర్పాటు చేయనున్నారు.ప్రజాప్రతినిధుల సహకారంతో పట్టణాల్లో మూడో కన్ను ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో రాకపోకలు నిర్వహించే ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు పోలీస్‌శాఖ సన్నద్ధం అవుతోంది. పోలీస్‌శాఖలో ఇటీవల కాలంలో సాంకేతికతను పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. నేరాల సంఖ్య  పెరగడం… వాటిని పరిష్కరించాలని ఉన్నతాధికారుల ఒత్తిడి ఉండడంతో త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. మహానగరం హైదరాబాద్‌లో జనాభాతో పోలిస్తే పోలీస్‌ సిబ్బంది తక్కువగా ఉన్నారు. అక్కడ సీసీ కెమెరాల బిగింపునకు నాంది పలికారు. పండుగలు, బందోబస్తు తదితరాలను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నచోట నుంచే పర్యవేక్షించడం సత్ఫలితాలనిచ్చింది. దాంతో అన్ని జిల్లాల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. మెదక్‌ పట్టణ కేంద్రంగా ఏర్పడిన జిల్లాలో 21 ఠాణాలు ఉన్నాయి. ప్రతి ఠాణాలో, వాటి పరిధిలోకి వచ్చే పట్టణాలు, ఇతర గ్రామాల్లో కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు, దాతల సహకారంతో వాటిని బిగిస్తున్నారు. జిల్లా కేంద్రం మెదక్‌ పట్టణంలో దాతల సహకారంతో రాందాస్‌ చౌరస్తా, పాత, కొత్త బస్టాండ్‌, జేఎన్‌ రోడ్డు చౌరస్తా, తారకరామనగర్‌ కాలనీ, మెదక్‌-రామాయంపేట ప్రధాన రహదారిపై బిగించారు.
Tags:Plan to set up CMS cameras in villages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *