ప్రణాళికలు సరే… ఆచరణ ఎక్కడా…

Date:09/10/2018
కర్నూలు ముచ్చట్లు:
తిరుపతి-తిరుమల తరహా టెంపుల్‌ సిటీగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా దేవస్థాన ఉద్యోగులకు నివాస సముదాయాలు, మౌలిక సదుపాయాలతోపాటు ఆటవిడుపునకు క్రీడా ప్రాంగణం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శ్రీశైలంలో తాత్కాలిక నివాసం ఉంటున్న వారికి సైతం సున్నిపెంటలో ప్లాట్లు  కేటాయించి ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద నిధులు అందించేలా నిర్ణయించారు.
మొదట్లో వడివడిగా అడుగులు వేసిన అభివృద్ధి పనులు ప్రస్తుతం తడబడుతున్నాయి. ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న కొన్ని నివాస సముదాయాల గదులు ఇరుగ్గా ఉన్నాయని, వాస్తు ప్రకారం లేవని కొందరు దేవస్థాన ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నవారికి సున్నిపెంటలో 66.58 ఎకరాలు కేటాయించారు. ఇందులో ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున 1,020 మంది ఇళ్లు కట్టుకునేలా లేఅవుట్లు వేశారు. ఇప్పటివరకు కేవలం వందలోపే నిర్మాణాలు జరిగాయి.
మిగిలినవారు ముందుకొచ్చి ఇంటిని నిర్మించుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఎన్టీఆర్‌ పథకం కింద ఇచ్చే రూ.లక్షన్నర సరిపోవని, ఇల్లు కట్టాలంటే రూ.10 లక్షల వరకైనా అవుతుందనేది వారి వాదన. దీంతో శ్రీశైలంలో ఉంటున్న తాత్కాలికవాసుల తరలింపు ఇప్పుడల్లా జరిగేలా లేదు.శ్రీశైలం దేవస్థాన ఉద్యోగులకు స్థాయిలవారీగా నివాస సముదాయాల నిర్మాణానికి సున్నిపెంటలో సుమారు 19 ఎకరాలు కేటాయించారు. ఇందులో 1బీహెచ్‌కే, పెద్దవి నాలుగు బ్లాకులు నిర్మిస్తుండగా 2బీహెచ్‌కే క్వార్టర్స్‌ మూడు బ్లాకుల్లో చేపట్టారు.
మొత్తం 297 గదులు ఉద్యోగులకు సిద్ధం చేస్తున్నారు. నివాస సముదాయాల నిర్మాణ ప్రదేశంలో విద్యుత్తు స్తంభాలు అడ్డుగా ఉన్నాయి. వాటిని తొలగించాలంటూ లేఖ పెట్టుకోగా నగదు చెల్లించాలని కోరారు. రూ.30 లక్షలు విద్యుత్తు శాఖకు చెల్లించారు. చెల్లించి రోజులు గడుస్తున్నా స్తంభాలు మాత్రం తొలగించలేదు. ఇదొక కారణం కాగా కూలీల కొరత ఉంది. మరోవైపు గుత్తేదారుకు బిల్లులు సకాలంలో కాకపోవడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నట్లు సమాచారం. దీనికీ కారణం లేకపోలేదు. దేవస్థాన ఈఈ స్థాయి ఉద్యోగి గుత్తేదారుకు బిల్లులు చెల్లించడానికి 4 శాతం కమీషన్‌ కోరుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
Tags: Plans are ok … practical nowhere …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *