చిన్నపిల్లల గుండెమార్పిడి ఆపరేషన్ల నిర్వహణకు ప్రణాళికలు
– దేశీయ గోజాతి అభివృద్ధి కేంద్రం ఏర్పాటు
– టిటిడి అధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి సమీక్ష
తిరుపతి ముచ్చట్లు:
శ్రీ పద్మావతి హృదయాలయంలో చిన్నపిల్లల గుండె మార్పిడి ఆపరేషన్లు కూడా నిర్వహించడానికి మూడు నెలల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి మంగళవారం ఆయన టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రత్యేకశ్రద్ధతో ఏర్పాటుచేసిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఆరు నెలల్లో 400 గుండె ఆపరేషన్లు పూర్తి చేశారని చెప్పారు. ప్రస్తుతం వారానికి 20 ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలను త్వరగా ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అవసరాలకు రోజుకు కావాల్సిన 4 వేల లీటర్ల పాలు, శ్రీవారి ఆలయానికి అవసరమైన నెయ్యి దేశీయ గోవుల నుండి సేకరించడం కోసం గోవుల సేకరణ ప్రక్రియ డిసెంబరు నాటికి పూర్తి చేయాలని డాక్టర్ జవహర్‌రెడ్డి సూచించారు. దీంతోపాటు నెయ్యి తయారీ ప్లాంట్‌ను కూడా డిసెంబరులో ప్రారంభించడానికి పనులు వేగవంతం చేయాలన్నారు. టిటిడి ఆధ్వర్యంలో ఆదర్శ దేశీయ గోజాతి అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని గోశాలలను శాటిలైట్ గోశాలలుగా తయారుచేసి వీటిని ఎస్వీ గోసంరక్షణశాలకు అనుసంధానం చేయాలని సూచించారు. తద్వారా గోవులు కబేళాలకు పోకుండా కాపాడవచ్చని, వీటిని రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా అందించవచ్చని తెలిపారు. టిటిడి ఆయుర్వేద ఫార్మశీ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి యంత్రాలను సమకూర్చుకుని ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రారంభించాలన్నారు. పంచగవ్య ఉత్పత్తులపై 20 శాతం వరకు రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, ఆన్లైన్ ద్వారా వీటి అమ్మకాలు పెంచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎస్వీ గోశాలలో ఫీడ్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఏపిఎస్ఆర్టిసి సెప్టెంబరులో 50 విద్యుత్ బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేస్తోందని, నవంబరుకు మరో 50 బస్సులు తిరుపతి – తిరుమల మధ్య నడుస్తాయని చెప్పారు. తిరుమలలో యాత్రికుల కోసం నడుపుతున్న ఉచిత బస్సుల స్థానంలో కూడా విద్యుత్ బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించి ఆదా చేయడం కోసం ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. తిరుమలలో అతిథిగృహాలకు విద్యుత్ మీటర్లు ఏర్పాటుచేసే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ-ఎంబుక్ విధానం చాలా బాగుందని, దీన్ని టిటిడి ఇంజినీరింగ్ విభాగంలో పూర్తిస్థాయిలో అమలుచేయడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు.ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. టిటిడి కళాశాలలకు న్యాక్ గుర్తింపు పొందేందుకు అవలంబిస్తున్న విధానం బాగుందని, దీన్ని అన్ని కళాశాలలకు అమలుచేయాలని సూచించారు. టిటిడి విద్యాసంస్థల్లో ఏర్పాటుచేయ తలపెట్టిన స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం ప్రభుత్వానికి సొమ్ము చెల్లించిన భూమిని త్వరగా స్వాధీనం చేసుకుని ఇంటిస్థలాలు కేటాయించే పని ప్రారంభించాలన్నారు.
Tags: Plans for the management of pediatric heart transplant operations