దేవాలయాల్లో ప్లాస్టిక్ బ్యాన్

విజయవాడ ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో ఇక నుంచి ప్లాస్టిక్‌ వస్తువులకు స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లతో పాటు ప్లాస్టిక్‌ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి ఇకపై అనుమతించబోమని తేల్చి చెప్పింది. అలాగే ఆలయానికి అనుబంధంగా ఉండే దుకాణాల్లో సైతం ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల అమ్మకాలను నిషేధించనున్నారు. ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్‌ సంచుల వినియోగానికి పూర్తిగా చెక్‌ పెట్టాలని సంకల్పించింది. తొలి దశలో జూలై 1 నుంచి 6 (ఏ) కేటగిరీగా వర్గీకరించిన ప్రధాన ఆలయాలన్నింటిలో ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించనున్నారు.

ఈ మేరకు ఈవోలకు దేవదాయ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి రూ. 25 లక్షలు, ఆపైన ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ 6 (ఏ) కేటగిరీగా వర్గీకరించింది. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో మొత్తం 24,699 ఆలయాలు, మఠాలు, సత్రాలు ఉండగా… ఇందులో 174 ఆలయాలు, 28 సత్రాలు, మఠాలు 6 (ఏ) కేటగిరీ కిందకు వస్తాయి. జూలై 1 నుంచి ఆయా ఆలయాలు, మఠాలు, సత్రాలలో ప్లాస్టిక్‌ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు తగిన చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ఇప్పటికే ఆయా ఆలయాలు, సత్రాల ఈవోలకు ఆదేశాలు జారీ చేసింద. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో గత కొద్ది నెలల నుంచి ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అమలవుతున్న తరహాలోనే ప్రధాన దేవాలయాల్లో శుభ్రమైన మంచి నీటి సరఫరాకు చర్యలు చేపడతారు. అలాగే మంచి నీటి సరఫరా పాయింట్ల వద్ద స్టీల్‌ గ్లాస్‌లను అందుబాటులో ఉంచుతారు. భక్తులు ఇంటి నుంచి మంచినీరు తెచ్చుకున్నా గాజు సీసాలు లేదంటే స్టీల్‌ బాటిళ్లలో తెచ్చుకునేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Tags: Plastic ban on temples

Leave A Reply

Your email address will not be published.