ఖరీఫ్ కు పుష్కలంగా సాగు నీరు!

Date:14/04/2018
జోగులాంబ గద్వాల ముచ్చట్లు:
తెలంగాణలో సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి జిల్లానూ సస్యశ్యామం చేసి.. వ్యవసాయోత్పత్తికి అనుకూల ప్రాంతంగా మలచేందుకు యత్నిస్తోంది. ఈ లక్ష్య సాధనకు ముందడుగు అన్నట్లు అన్ని జిల్లాల్లోనూ నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తోంది. పథకాల నిర్మాణం వేగవంతం చేసి సాగు నీటి కొరతను పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇదిలాఉంటే ప్రభుత్వ చొరవతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. దీనికి తోడు కొత్తగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ పథకాలను అందుబాటులోకి తెచ్చి ఖరీఫ్‌లోనే 8.95 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.65 లక్షల ఎకరాలకు, భీమా ద్వార 2 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాక నెట్టెంపాడు ద్వార 2 లక్షల ఎకరాలకు, కోయిల్‌సాగర్‌ ద్వార 55 వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా కృషి చేస్తున్నారు. ఇక ఆర్డీఎస్‌ ప్రాజెక్టు ఆయకట్టులో నీళ్లందని 55వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఈ పథకాన్ని జూన్‌ చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. నెట్టెంపాడు పనులు చేయడంలో జాప్యం చేస్తున్న ప్యాకేజీలు 99బీ, 100, 105, 106 ప్యాకేజీల కాంట్రాక్టర్లపై అధికారయ యంత్రాంగం అసంతృప్తిగా ఉంది. వీరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలాఉంటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో నెలాఖరులోగా అయిదో పంపు పనులు పూర్తి చేసేలా కార్యచరణ రూపొందించుకున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పనుల్లో ఉన్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఇంజినీర్లతో పరిష్కరిస్తూ పనులను వేగంగా కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడులో కొండపల్లి అక్విడక్ట్‌ అడ్డంకిగా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలో సాగు నీటికి సమస్యలు రాకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలపై రైతాంగం హర్షం వ్యక్తంచేస్తోంది.
Tags: Plenty of cultivated water to kharif!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *