జగిత్యాలకు జలకళ 

Date:17/07/2018
జగిత్యాల ముచ్చట్లు:
మొన్నటివరకూ నీటి సమస్యతో సతమతమైన జగిత్యాల జలకళ సంతరించుకుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు, బావులతో పాటూ ప్రాజెక్టుల్లోనూ భారీగా నీరు చేరింది. దీంతో ఈ దఫా ఖరీఫ్ సాగుకు పెద్దగా నీటి సమస్యలు ఉండవని రైతులు భావిస్తున్నారు. ప్రస్తుతం వర్షపాతం ఎక్కువగానే ఉండడంతో భూగర్భ జలాలు సైతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. జూన్ మొదటివారంలోనే వర్షాలు బాగానే కురిసినా.. ఆ ఎఫెక్ట్ కొనసాగలేదు. అయితే.. జులైలో కురుస్తున్న వానలతో మాత్రం రాష్ట్రంలో నీటివనరులు మెరుగుపడ్డాయి. జూన్‌1 నుంచి ఇప్పటివరకు జగిత్యాలలో సాధారణ వర్షపాతం 303.1 మి.మీ.కిగాను 390.2 మి.మీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వర్షంపాతం అధికంగా ఉండటంతో ఇప్పట్నుంచే భూగర్భ జలమట్టం పెరిగే అవకాశముందని అంటున్నారు. గతేడాదితో పోలిస్తే మీటరుకుపైగా లోతులోనే నీళ్లున్నా ప్రస్తుత వర్షాలపై ఆశలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భూగర్భ జలాల ఆధారంగానే రైతులు వరిసాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఆ మేరకు పెద్దఎత్తున వరినార్లు వేస్తున్నారు. సాధారణంగా జులై నుంచి ఆగస్టు మొదటివారం వరకు పెద్దఎత్తున వరినాట్లు వేస్తారు. దీంతో నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. జగిత్యాల అర్బన్‌, మల్యాల, కొడిమ్యాల, కథలాపూర్‌, కోరుట్ల, మల్లాపూర్‌, మెట్‌పల్లి మండలాల్లో 10 మీటర్లకన్నా దిగువన జలాలుండటం ఆందోళనకర అంశంగానే ఉంది. ఇప్పట్నుంచి భారీ వర్షాలు నమోదైతేనే ఈ ప్రాంతంలో చెరువులు, కుంటల్లోని నీరుచేరి భూగర్భ జలమట్టం మెరుగుపడుతుందని నిపుణులతో పాటూ రైతులూ భావిస్తున్నారు. ఈఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం ఉంటుందన్న వాతావరణ నిపుణుల అంచనాలు అన్నదాతల్లో ఆశలు కలిగిస్తున్నాయి. అయితే అక్టోబరు వరకు ఆశించినమేర వర్షాలు కురిస్తేనే పంటలసాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరుతుందని కర్షకులు అంటున్నారు. జిల్లాలో 1.34 లక్షల హెక్టార్లలో వానాకాలం పంటలు పండిస్తారని అంచనా. ఇక ఎక్కువగా వరిసాగు 53 వేల హెక్టార్లుగా ఉండనుంది. ఇక్కడ వరి ప్రధానపంట కావటంతో నీటి అవసరం అధికంగానే ఉంటుంది. అందుకే జిల్లాకు ప్రధాన నీటి వనరుగా ఉన్న శ్రీరాంసాగర్ లో ఆశించినస్థాయిలో జలాలు ఉంటేనే సాగునీటి సమస్యలు ఉత్పన్నంకావు. ఈ నేపథ్యంలోనే.. వర్షపాతం కొనసాగి.. ప్రాజెక్టులు నిండాలని స్థానిక రైతాంగం కోరుకుంటోంది.
జగిత్యాలకు జలకళhttps://www.telugumuchatlu.com/plural-for-jagatitas/
Tags; Plural for Jagatitas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *