Natyam ad

ఎలక్షన్ మూడ్ లో పొలిటికల్ లీడర్స్

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలుగు రాష్టా ల్లో ఇప్పటికిప్పుడు ఎలాంటి ఎన్నికలూ లేవు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు ముందస్తు నిర్ణయం తీసుకున్నా వచ్చే ఏడాది వరకూ ఎలక్షన్లు జరిగే అవకాశాలే లేవు. అయినా కూడా రెండు రాష్ట్రాలలో అన్ని రాజకీయ పార్టీలూ ఎన్నికల మూడ్ లోకి జారుకున్నాయి. ప్రజా సమస్యల పట్టింపే లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఫోకస్ మొత్తం రాజకీయం, ఎన్నికల మీదే పెట్టేశాయి.  ప్రజలు నేతలను సమస్యలపై ప్రశ్నలు సంధిస్తున్నా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకునే మూడ్ లో లేవు. ముఖ్యంగా ఏపీలో అధికార వైపిపి ప్రజా సమస్యలు ప్రస్తావించే విపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగుతూ వారి ఆందోళనలు, నిరసనలను అడ్డుకోవడం,అణచి వేయడం, అరెస్టులు చేయడంలో యమా బిజీగా ఉంది. టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వంటి సీరియస్ ఇష్యూలను కూడా జగన్ ప్రభుత్వం లైట్ గా తీసుకుంటోంది.దీనిని కూడా కక్ష సాధింపు చర్యలకు ఒక అవకాశంగా భావిస్తూ అరెస్టులకు పాల్పడుతోంది.  ఇక తెలంగాణ విషయానికి వచ్చే సరికి ఇక్కడ అధికార తెరాసకు దీటుగా బీజేపీ, కాంగ్రెస్ లు కూడా వరుస కార్యక్రమాలతో బిజీగా ఉంటూ రానున్న ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించారు.  అధికార పార్టీ కార్యాలయానికి వంద కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వం ధారాదత్తం చేసిన అంశం కంటే.. రాజకీయంగా ప్రజలలో మరింత పట్టు సాధించుకోవడంపైనే ప్రతిపక్షాలు తమ దృష్టి మొత్తం కేంద్రీకృతం చేశాయి.

 

 

బీజేపీ అయితే వరుసగా జాతీయ నాయకుల పర్యటనలకు షెడ్యూల్ చేసుకుని, అధికార పార్టీపై విమర్శల దాడికే ప్రాధాన్యత ఇస్తున్నది. ఇక కాంగ్రెస్ రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన స్పందన ఉత్సాహంలో ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది.  అధికార టిఆర్‌ఎస్‌ నేతలు కూడా  జిల్లాల పర్యటనతో బిజీగా ఉన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హోరెత్తిస్తూ, ఆ కార్యక్రమాలను కూడా బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శనాస్త్రాలు సంధించడానికే ఉపయోగించుకుంటున్నారు.  అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం, రైలుత ఇక్కట్లు, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వంటి అంశాలేవీ రాజకీయ నాయకులకు ఎన్నికల మూడ్ లో కనిపించడం లేదు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోరు తప్పదన్న అంచనాతో కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా ఎన్నికల సన్నాహాలపైనే దృష్టి సారించాయి. ఇదే అంచనాతో తెరాస కూడా సొంత ఇంటిని చక్కదిద్దుకుంటూనే, విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించడానికే పరిమితమైంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చాటుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ లు సర్వ శక్తులూ ఒడ్డుతుంటే.. టీఆర్ఎస్ రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయం లేదని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నది.దీంతో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలూ కూడా ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షాలు ఆ పని చేయడం లేదు. ఎంత సేపూ పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించి జనాల్లో కూడా ఎలక్షన్ మూడ్ వచ్చేసిందన్న భ్రమలో ఉన్నాయి.

 

Post Midle

Tags: Political Leaders in the Election Mood

Post Midle

Leave A Reply

Your email address will not be published.