పొలిటికల్ రేస్ (నిర్మల్)

Date:16/07/2018
నిర్మల్ఉముచ్చట్లు:
మ్మడి జిల్లా రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా చెప్పుకునే నిర్మల్‌ శాస నసభ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, జేజేపీ నేతలు కొద్దిరోజులుగా తమ కార్యకలాపాలను ఉధృ తం చేశాయి. ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నందున అందరి దృష్టి ఇటు వైపే కేంద్రీకృతమవుతోంది. మంత్రి హోదాలో ఇంద్రకరణ్‌ రెడ్డి కొద్ది రోజుల నుంచి నియోజకవర్గానికే పరిమితమవుతూ అధికార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. అలాగే వివాహ శుభాకార్యాలకు, పరామర్శలకు, ప్రైవేటు కార్యక్రమాలకు మంత్రి హజరవుతూ తన ప్రతిష్టను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి హోదాలో ఆయన ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాబోయే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు.కాగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి గతానికి భిన్నంగా నిర్మల్‌ నియోజకవర్గ వ్యవహారాలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ పార్టీలో చేరికలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులను లక్ష్యంగా చేసుకుంటూపావులు కదుపుతున్నారు. మహేశ్వర్‌రెడ్డి వ్యూహం అమలవుతుండడం వల్లే ఇటీవలి కాలంలో ఆ పార్టీలోకి చేరికలు పెరిగిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆయన అన్ని మండలాల్లోని గ్రామాల్లో పర్యటిస్తూ శుభకార్యక్రమాలు, పరామర్శలకుహజరవుతున్నారు. ప్రతిరోజూ ఓ మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులతో భవిష్యత్‌పై వ్యూహరచన చేస్తుండడం ఆ పార్టీకి కలసివచ్చే అవకాశముంది.
ఇదిలా ఉండగా బీజేపీ కూడా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు తీసిపోని విధంగా పార్టీపరమైన కార్యక్రమాలే కాకుండా ప్రజా సమస్యలు, భూ కబ్జాలు, శాంతి భధ్రతల సమస్యలపై ఆందోళనలు చేస్తూ జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ తరపున అయ్యన్న గారి భూమయ్య, రావుల రాం నాథ్‌, డాక్టర్‌ మల్లికార్జున్‌ రెడ్డిలో ఎవరో ఒకరు ఈసారి ఆసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేయవచ్చన్న ఉహాగానాలు మొదలయ్యాయి. ఈ ముగ్గురు కలిసి పార్టీ కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు.ముందస్తు ఎన్నికలు అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో జరగవచ్చన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో నిర్మల్‌ నియోజకవర్గంలో ఆయా పార్టీ నేతలు ఆ దిశగా సిద్ధ్దమవుతున్నారు. ఇక్కడి నాయకులు చేపట్టే ప్రతికార్యక్రమం వెనక ముందస్తు లక్ష్యమే దాగి ఉందన్న అంశం వెల్లడవుతోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అధికార టీఆర్‌ ఎస్‌ అధిష్ఠానం మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ నియోజకవర్గాలకు పరిమితం కావాలంటూ ఆదేశించడం, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ గాంధీ భవన్‌ కేంద్రంగా శ్రేణులకు దిశా నిర్దేశం చేయడంతో పాటు జిల్లాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తుండడం సామాన్యు ల్లోనూ ఆసక్తి రేకేత్తిస్తోంది. అలాగే బీజేపీ నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర ఇక్కడి ఆ పార్టీవర్గాల్లో ఉత్సాహం నింపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ అనుబంధ సంఘాలు కూడా ఎన్నికల కోణంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సారి జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తారని భావిస్తున్న ప్రముఖ వైద్యురాలు డాక్టర్‌ స్వర్ణారెడ్డి కొద్ది రోజుల నుంచి నియోజకవర్గంలోని గ్రామాల్లో ముమ్మరంగా పాదయాత్రలు నిర్వహిస్తూ జనానికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఇప్పటి వరకు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే విషయం స్పష్టం కాకున్నప్పటికీ తప్పక బరిలో నిలవనున్నారని ఆమె వర్గీయులు వెల్లడిస్తున్నారు. ఇదే విషయాన్ని పాదయాత్ర సందర్భంగా స్వర్ణారెడ్డి కూడా అన్ని చోట్ల చెబుతూ తనను ఆదరించి మద్దతు తెలపాలని కోరుతున్నారు. ఇలా నిర్మల్‌ నియోజకవర్గంలో చతుర్మఖ రాజకీయం నడుస్తోంది.ఇంటెలిజెన్స్‌ వర్గాలు, జాతీయ స్థాయి ప్రైవేట్‌ ఏజెన్సీలు నిర్వహిస్తున్న సర్వేల ఆధా రంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ క్షేత్రస్థాయి కార్యచరణను అమలు చేస్తోంది. మండలాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అలాగే అక్కడి నాయకులపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయా లున్నాయన్న అంశంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య ఉన్న వర్గ విభేదాలపై కూడా టీఆర్‌ఎస్‌ అంతర్మథనం సాగిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి లోపాలన్నింటినీ సరిదిద్దుకొని ఇక పకడ్బందీగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వ్యూహత్మకంగా నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ ఇతర పార్టీల నేతలను ఖంగుతినేలా చేస్తున్నారు. ఆయన రాష్ర్టానికి మంత్రిగా కొనసాగుతున్నప్పటికి నిర్మల్‌ నియో జకవర్గానికే సింహభాగం ప్రాధాన్యమిస్తూ ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ జనం నోళ్లలో నానుతున్నారు. అలాగే ఎప్పటికప్పుడు పార్టీ స్థితి గతులు, నేతల కార్యకలాపాలపై కూడా మంత్రి ఓ కన్నెసి ఉంచుతున్నారు. దీని కి తోడు కాంగ్రెస్‌, బీజేపీతో పాటు డాక్టర్‌ స్వర్ణారెడ్డి కార్యక్రమాలను గమనిస్తున్నట్లు ఆ పార్టీ వర్గీయులు వెల్లడిస్తున్నారు.
ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నిర్మల్‌ సెగ్మెంట్‌లో మాత్రం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తీసిపోని విధంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. ముఖ్యంగా డీసీసీఅధ్యక్షుడు మహేశ్వర్‌ రెడ్డి గత రెండేళ్ల నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ నిర్మల్‌ నియోజకవర్గంపై తిరిగి పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఆయన వ్యూహ ప్రతి వ్యూహాలను అమలు చేస్తూ పథకం ప్రకారం యువకులు, ఇతర పార్టీల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమం లో పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకునే విధంగా అమ లు చేస్తున్న యాక్షన్‌ ప్లాన్‌ ఎదుటి పార్టీల్లో గుబులు రేపుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడులు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌ రెడ్డి పంపిణీ చేసిన కరపత్రాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, కాంగ్రెస్‌ అమలు చేసిన పథకాలను వివరిస్తూ ఆయన ఈ కరపత్రాలను ముద్రించి, పంచడం విశేషం.
భారతీయ జనతా పార్టీ సైతం ప్రధాన పార్టీలకు తీసిపోనివిధంగా పోటా పోటీ కార్యక్రమాలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇమేజ్‌ను, స్థానిక సమస్యలు, భూ ఆక్రమణలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను అస్ర్తాలుగా మలుచుకొని కొద్ది రోజుల నుంచి సెగ్మెంట్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆశించిన రీతిలో స్పందన లభిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడి సీనియర్‌ నేతలు అయ్యన్న గారి భూ మయ్య, రావుల రాంనాథ్‌తో పాటు ఇటీవల ఆ పార్టీలో చేరిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, నియోజకవర్గంలో ముమ్మరంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ ఉనికిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నా రు. సెంటిమెంట్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆ పార్టీ పకడ్బందీ వ్యూహరచన సాగిస్తోంది. ఆ పార్టీ తరపున ఈ సారి అయ్యన్న గారి భూమయ్య గానీ డాక్టర్‌ మల్లికార్జున్‌ రెడ్డి గానీ, అసెంబ్లీ స్థానానికి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అధిష్ఠానం ఆదేశిస్తే తాను కూడా రంగంలో ఉంటానని రావుల రాంనాథ్‌ వెల్లడిస్తున్నారు. అధిష్ఠానం టికెట్‌ ఎవరికి ఇచ్చినా తాము ఐక్యంగా పని చేస్తామంటూ ఈ ముగ్గురునాయకులు స్పష్టం చేస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంలో ఉన్నారు.
పొలిటికల్ రేస్ (నిర్మల్) https://www.telugumuchatlu.com/political-race-nirmal/
Tags:Political Race (Nirmal)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *