Natyam ad

రాజకీయ వ్యూహాలు…ఏపీలో  పొలిటికల్ హీట్

గుంటూరు ముచ్చట్లు:

ఆంధ్ర  ప్రదేశ్ లో పొత్తుపొడుపుల ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది. మోడీతో భేటీ తరువాత జనసేనాని ఒంటరి పోరువైపే మొగ్గు చూపుతున్నారని పించేలా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ప్రసంగాలు ఉంటున్నాయి. అశేష సినీ ప్రేక్షక అభిమానుల దన్ను, జనాకర్షణ శక్తి ఉందేమో కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఉన్న రాజకీయ అనుభవం, కార్యదక్షత మాత్రం లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ కు బలమైన రాజకీయ వారసత్వం ఉంది.అయితే ఈ మూడున్నరేళ్ల పాలనలో జగన్ ప్రజాకర్షణ శక్తిని పూర్తిగా కోల్పోయాడని, వారసత్వ బలం ఆయనకు అండగా నిలిచే అవకాశమే లేదని కూడా పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో   ప్రజలను కూడగట్టుకోవడానికి, ప్రజాభిమానాన్ని తనకు రాజకీయపరంగా అనుకూలంగా చేసుకోవడానికి పవన్ కల్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమం రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయంటున్నారు.

 

 

ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే రాష్ట్రంలో రాజకీయ హీట్ పీక్స్ కు వెళ్లిపోవడానికి ఇది కూడా ఒక కారణమేనంటున్నారు. అయితే తన సినీ గ్లామర్ ను నమ్ముకుని పవన్ కల్యాణ్ విజయంపై ధీమా పెంచుకోవడం అత్యాశే అవుతుందన్నది పరిశీలకల విశ్లేషణ.  ఎన్టీఆర్ సినిమాల నుంచి నేరుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి కనీ వినీ ఎరుగని రీతిలో దశాబ్దాల కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టిన మాట వాస్తవమే కానీ, ఎన్టీఆర్ కరిష్మాకు ఏ విధంగా చూసినా పవన్ కల్యాణ్ సరితూగడని పవన్ కల్యాణ్ అభిమానులే చెబుతారు.  అన్నిటికీ మించి మారిన రాజకీయ పరిస్థితులలో సినీ  అభిమానం, ఆదరణ ఎన్నికల్లో ఓట్లుగా మారే అవకాశం ఎంత మాత్రం లేదని చెబుతున్నారు. ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవిని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. అలాగే 2019 ఎన్నికలలో పవన్ కల్యాణ్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి ఏం సాధించగలిగారని ప్రశ్నిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఒంటరి పోరు నిర్ణయం వైసీపీలో ఒకింత ఉత్సాహాన్నీ ఆనందాన్ని నింపుతున్న మాట వాస్తవమేనని చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేనలు పొత్తు పెట్టుకుంటే మాత్రం వైసీపీకి చుక్కలేనని ఆ పార్టీ నేతలే అంటున్నారు. రాజకీయ విశ్లేషణలు సైతం ఆ దారిలోనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సారి తమిళనాడు రాజకీయాలలో గతంలో సంభవించిన పరిణామాలను గమనిస్తే.. పవన్ ఒంటరి పోరు నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను పెద్దగా ప్రభావితం చేసే పరిస్థితి ఉండదని అంటున్నారు.తమిళనాడులో ప్రధానంగా డీఎంకే..

 

 

Post Midle

అన్నాడీఎంకేల మధ్యే అధికారం మారుతుంటుంది. ఆ పరిస్థితుల్లో  సినీ రంగంలో విశేషంగా ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న విజయకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన ప్రవేశంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని అప్పట్లో రాజకీయ పండితులు పలు విశ్లేషణలు చేశారు. కానీ అవేమీ కరెక్ట్ కాదని ఆ తరువాత ఫలితాలు రుజువు చేశాయి. తమిళనాట రాజకీయ ముఖచిత్రం ఏమీ మారిపోలేదు. అలాగే ఆ తరువాతి కాలంలో ప్రసిద్ధ నటుడు కమల్ హసన్ రాజకీయం కూడా తమిళనాట రాజకీయ సంచలనాలేమీ సృష్టించలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఒంటరి పోరు నిర్ణయంతో కూడా పెద్దగా అద్భుతాలేవీ జరిగే అవకాశాలు లేవు. 2019 ఎన్నికలలో జనసేన ఒంటరి పోరు వల్ల అప్పటి విపక్ష పార్టీ  వైసీపీ లబ్ధి పొందింది. 2019లో పవన్ ఒంటరి పోరు ఎలా అయితే అప్పటి అధికార పక్షానికి నష్టం చేకూర్చిందో… 2024లో ఒక వేళ జనసేన ఒంటరిగానే బరిలోకి దిగితే..త్రిముఖ పోరులో అధికార వైసీపీ నష్టపోక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే జనసేనాని కార్యక్రమాలకు జనాదరణ పెరుగుతున్న కొద్దీ అధికార వైసీపీలో కలవరం పెరిగిపోతోందంటున్నారు.ఆ కారణంగానే అడుగడుగునా జనసేనాని పర్యటనలను, కార్యక్రమాలను జగన్ సర్కార్ అడ్డుకుంటోందనీ, వాటిని నిలువరించడానికి నిషేధాజ్ణలు విధిస్తోందనీ చెబుతున్నారు.  2019 ఎన్నికల్లో జనసేన ఒక్క స్థానం మాత్రమే గెలుచుకున్న సంగతిని ఈ సందర్భంగా పరిశీలకలు ప్రస్తావిస్తున్నారు. ఈనేపథ్యంలో పవన్ ఒంటరి పోరు పై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ముందడుగు వేయడం మంచిదన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది.

 

Tags: Political strategies…Political heat in AP

Post Midle