కర్ణాటకలో వేడెక్కిన రాజకీయాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న పార్టీలు

Politicians in the state of Karnataka are engaged in politics

Politicians in the state of Karnataka are engaged in politics

Date:11/10/2018
బెంగళూర్ ముచ్చట్లు:
కర్ణాటక రాజకీయం వేడెక్కింది. నాలుగునెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఈ దక్షిణాది రాష్ట్రంలో ఇప్పుడు మరోసారి రాజకీయ సమరం ఆరంభమైంది. వచ్చే నెల 3న ఉప ఎన్నికలు జరగనుండటంతో పార్టీలు అప్పుడే అస్త్రశస్త్రాలు సమకూర్చుకుంటున్నాయి. మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు అధికార, విపక్షాలకు నిజంగా అగ్నిపరీక్షే. మాండ్యా, బళ్లారి, శివమొగ్గ లోక్ సభ, రామనగరం, జమఖండి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఇటీవల అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శివమొగ్గ లోక్ సభ స్థానానికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ నాయకుడు బి.శ్రీరాములు కూడా ఇటీవల అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగాలన్న లక్ష్యంతో తాను గెలిచిన బళ్లారి లోక్ సభ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికను నిర్వహించాల్సి వస్తోంది.
అదే విధంగా మాండ్యా నుంచి లోక్ సభకు ఎన్నికైన సీ.ఎస్. పుట్టరాజ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆయన కూడా రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకోవడంతో లోక్ సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. జనతాదళ్ (ఎస్) నాయకుడు, ముఖ్యమంత్రి కుమారస్వామి ‘‘చెన్నపట్నం’’ ‘‘రామనగర’’ స్థానాల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రామనగర స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికను నిర్వహిస్తున్నారు. జమఖండి ఎమ్మెల్యే సిద్ధ న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.మారిన పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికలు, కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్), బీజేపీలకు అగ్ని పరీక్ష. కనీసం సొంత స్థానాలను నిలబెట్టుకోలేకపోతే దాని ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై పడుతుంది.
గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఈసారి కాంగ్రెస్,జనతాదళ్ (ఎస్) కలసి పోటీ చేసే అవకాశముంది. ఎప్పటిలాగానే బీజేపీ ఒంటరి పోరు చేయనుంది. కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) కలసి పోటీ చేస్తే బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంది. రెండు బీజేపీ లోక్ సభ స్థానాలను కైవసంచేసుకోవడం ద్వారా కమలనాధులను కోలుకోలేని విధంగా దెబ్బతీయాలన్నది హస్తం పార్టీ లక్ష్యం.రాష్ట్ర బీజేపీ అధినేత బిఎస్ యడ్యూరప్ప గెలిచిన శివమొగ్గపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో యడ్యూరప్ప 6,06,216 ఓట్లను సాధించి విజయకేతనం ఎగురవేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి మంజునాధ భండార్ కి 2,42,911, జనతాదళ్ (ఎస్) అభ్యర్థి గీతా శివరాజ్ కుమార్ కు 2,40,636 ఓట్లు లభించాయి. ఈసారి కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) కలసి పోటీ చేస్తే కమలనాధులు ఎదురీదక తప్పదు. ఈ లోక్ సభ నియోజకవర్గంలో భద్రావతి, బైండూర్, సాగర్, సొరబ, శికారిపుర, షిమోగా, షిమోగా రూరల్, తీర్థహళ్లి అసెంబ్లీ స్థానాలున్నాయి. మరో ప్రతిష్టాత్మక స్థానం బళ్లారి. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బి.శ్రీరాములుకు 5,34,406 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి హనుమంతప్ప 4,49,262, జనతాదళ్ (ఎస్) అభ్యర్థి రవినాయక్ 12,613 ఓట్లు సాధించారు. ఈసారి కాంగ్రెస్, జనతాదళ్ కలిసి పోటీ చేస్తే బీజేపీకి గడ్డుపరిస్థితే ఎదురవుతుంది. ఈ లోక్ సభ స్థానం పరిధిలో బళ్లారి, బళ్లారి నగరం, కంప్లి, కుడ్లిగి, సండూర్, హడగళ్లి, హగరి బొమ్మనహళ్లి, విజయనగర అసెంబ్లీ స్థానాలున్నాయి. గతఎన్నికల్లో మాండ్యా నుంచి పోటీ చేసిన సీఎస్ పుట్టరాజు 5,24,370 ఓట్లతో విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి రమ్య 5,18,852 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బి. శివలింగయ్య 86,993 ఓట్లు సాధించారు. గత ఎన్నికల ప్రాతిపదికన చూస్తే ఇక్కడ జనతాదళ్ (ఎస్) గెలుపు ఖాయం.ఈ లోక్ సభ స్థానం పరిధిలో మాళవలి, మద్దూర్, మేలుకోటె, మండ్య, శ్రీరంగపట్నం, కృష్ణరాజనగర, కృష్ణ రాజ్ పేట, నీగ మంగళ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం మీద మూడు లోక్ సభ స్థానాల్లో మాండ్యలో జనతాదళ్ (ఎస్) గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) కలసి కట్టుగా ఒకే అభ్యర్థిని బరిలోకి దించితే బళ్లారి, శివమొగ్గ స్థానాల్లో కమలాన్ని నిలువరించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ నేపథ్యంలో కమలనాధులు ఆత్మరక్షణలో పడే పరిస్థితి కనపడుతోంది.కుమారస్వామి రాజీనామా చేసిన రామనగర అసెంబ్లీ స్థానాన్ని జనతాదళ్ (ఎస్) నిలబెట్టుకోవడం ఖాయం.
మొన్నటి ఎన్నికల్లో 92,626 ఓట్లు ఆయన సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ 69,990 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లీలావతి కేవలం 4,871 ఓట్లు సాధించారు. ఈ అసెంబ్లీ స్థానం బెంగళూరు రూరల్ లోక్ సభ స్థానం పరిధిలో ఉంది. చాగల్ కోటి జిల్లాలోని జమఖండి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధు న్యామగౌడ 49,245 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కులకర్ణి శ్రీకాంత 46,450 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ముంబయి,కర్ణాటక ప్రాంతంలోని ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,98,957 మంది. మొత్తం మీద ఈ ఐదు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) కలసికట్టుగా అభ్యర్థులను పోటీకి నిలబెడితే కమలనాధులకు కష్టాలు తప్పవు.
Tags:Politicians in the state of Karnataka are engaged in politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *