బెజవాడలో మారుతున్న రాజకీయాలు

Date:13/04/2018
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ నగరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు విజయవాడ ఒక ఆయువుపట్టు. ఇక్కడ జరిగే పరిణామాలు మొత్తం రాష్ట్రాన్నే ప్రభావితం చేస్తాయని అనేక సందర్భాల్లో రుజువైంది. అందుకే విజయవాడలోని అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే విషయంలో రాజకీయ పార్టీలు కీలకమైన ఎత్తులు వేస్తుంటాయి. తాజాగా విజయవాడలో పాగా వేసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు… పట్టు నిలుపుకునేందుకు టీడీపీ వేస్తున్న వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి.వైసీపీలోకి విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చేరుతుండటంతో… ఆయన మరోసారి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాజకీయ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. యలమంచిలి రవి, గద్దె రామ్మోహన్ ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో… ఈ ఇద్దరి మధ్య పోరు ఏ విధంగా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. నిజానికి వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి మరో స్థానానికి మారిపోవాలని… వీలైతే మరోసారి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో గద్దె రామ్మోహన్ ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన చంద్రబాబుకు చెప్పారని.. ఇందుకు బాబు కూడా సానుకూలంగానే స్పందించారనే ప్రచారం జరిగింది.అయితే వైసీపీ నుంచి ఈ సారి యలమంచిలి రవి రంగంలోకి దిగుతుండటంతో… ఆయనకు పోటీగా మళ్లీ ప్రజామోదం ఉన్న రామ్మోహన్ ను రంగంలోకి దింపాల్సిందేనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల్లో మంచి పేరు ఉన్న రామ్మోహన్ అయితేనే యలమంచిలి రవిని ధీటుగా ఢీ కొడతారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వైసీపీలోకి యలమంచిలి రవి ఎంట్రీతో విజయవాడ తూర్పు రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రామ్మోహన్ రంగంలో ఉంటే మాత్రం ఈ స్థానాన్ని గెలుచుకోవడం యలమంచిలి రవికి అంత సులువుకాదని బెజవాడ రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Tags: Politics in Bezewada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *