తెలంగాణ పల్లెల్లో జోరుగా సాగుతున్న రాజకీయాలు

Date:12/01/2019
నిర్మల్ ముచ్చట్లు:
 పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పల్లెల్లో జోరుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఏకగ్రీవ ఎన్నిక కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటున్న ఆశావహులను బుజ్జగించడమో లేక భయపెట్టే యత్నాలూ కూడా సాగిస్తున్నారన్న కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. నిర్మల్ జిల్లా పరిధిలోనూ ఈ తరహా ప్రోగ్రాం సాగుతోందని పలువురు అంటున్నారు. మరికొన్నిచోట్ల అభ్యర్ధులు ఎక్కువమంది ఉంటే సర్పంచి పోస్ట్ కు వేలం నిర్వహిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువ మొత్తం చెల్లించేందుకు ఎవరు ముందుకొస్తారో వారికే పదవి దక్కేలా ప్లాన్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. వేలం పాటలో ఓడినవారు ఒప్పందం ప్రకారం పోటీ నుంచి తప్పుకుంటున్నారని చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి చెల్లవు. ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ కొందరు ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు లొంగడంలేదు. పోటీ చేసి తీరతామని తేల్చి చెప్తున్నారు. అయితే ఇలాంటి వారి బలహీనతలు సొమ్ము చేసుకుంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా సర్పంచ్ పదవులు తమకే దక్కేలా కొందరు అభ్యర్ధులపై సామదానదండోపాయ విధానాలు జోరుగా ప్రయోగిస్తున్నారని పలువురు అంటున్నారు. ఇలాంటివాటికి లొంగని వారిని వెలివేసినట్లు కూడా మాట్లాడుతున్నారని వారికి ఓటేయొద్దని ఊరంతా ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
తొలివిడత ఎన్నికలకు నామినేషన్లు ముగిసిపోయినా ఏకగ్రీవ ఎన్నిక కోసం పంచాయతీల్లో ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. నామినేషన్లు ఉపసంహరణకు ఈనెల 13వ తేదీ వరకూ టైమ్ ఉంది. ఈ లోపు పోటీలేకుండా ఏకగ్రీవం చేసేందుకు పలువురు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మల్‌ జిల్లా కడెం మండలం పరిధిలో కొన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ముందస్తు వ్యూహాల ఫలితంగా కొన్ని గ్రామాల్లో ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు చేశారు. మరికొన్ని పంచాయతీల్లో పోటీ ఎక్కువగా ఉంది. బుజ్జగింపులు, ఇతరత్రా ప్రలోభాలు ఎరవేస్తున్నా కొందరు వెనక్కితగ్గడంలేదు. పోటీ చేస్తామనే అంటున్నారు. ఇలాంటి వారిని దారికి తెచ్చేందుకు కొందరు నాయకులు తమదైన ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. మరోవైపు పంచాయతీ పోస్ట్ లకు వేలం నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. వేలం పాట ఏకంగా రూ.10లక్షలు దాటిపోతుండడం విస్తుగొలుపుతోంది. సర్పంచ్ పోస్ట్ కు ఇంత పెద్ద మొత్తం చెల్లించేందుకు కొందరు సిద్ధమవుతుండడంపై గ్రామస్తులు నిర్ఘాంతపోతున్నారు. అయితే పోటీ చేసి తీరాలన్న పట్టుదలతో ఉన్నవారు మాత్రం ఇలాంటి చర్యలన్నింటినీ వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వ ప్రోత్సాహకం రూ.10 లక్షలు వస్తుంది. ఎమ్మెల్యే సైతం ప్రోత్సాహకంగా నిధులు మంజూరు చేస్తారంటూ ఏకగ్రీవం కోసం పలువురు యత్నిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీలు కూడా పంచాయతీ ఎలక్షన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కీలక నేతలు కూడా ఏకగ్రీవం కోసం తమదైన ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు.
Tags:Politics in Telangana villages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *