రంగులు మారుతున్న రాజకీయం…
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లాలో రాజకీయం రోజుకో మలుపు తీసుకుంటోంది. మాజీ జడ్పీ చైర్మన్ తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మూడు రోజు క్రితం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కంభం విజయరామిరెడ్డితో సమావేశమయ్యారు. తాజాగా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి బొల్లినేని వెంకటరామారావును కలిశారు. కలిగిరిలోని బొల్లినేని క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన మేకపాటికి వెంకటరామారావు ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించాలని వారి అనుచరులు చెబుతున్నారు. ఉదయగిరి అభివృద్ధి కోసమే బొల్లినేనిని కలిశానని మేకపాటి వ్యాఖ్యానించారు.మూడు రోజుల క్రితమే విజయరామిరెడ్డిని కలిశానని, బొల్లినేని, కంభం, చెంచల బాబుయాదవ్ తో తాను భవిష్యత్తులో కలిసి పనిచేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలే మొదటిప్రాధాన్యమని, వారికి అన్నివిధాలా అండగా ఉంటానన్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తానని, అందులో నేరుగా ప్రజలతోనే మాట్లాడతానన్నారు. మేకపాటికి ముఖ్యమంత్రి జగన్ ద్రోహం చేశారని బొల్లినేని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను పరిచయం చేస్తూ వీళ్లల్లో కొందరు మీ బాధితులే అని చెప్పారు. ఏవైనా ఇబ్బందులు పెట్టివుంటే తనను క్షమించాలని మేకపాటి కోరారు. ఉదయగిరి నుంచి ప్రత్యర్థులుగా వరుసగా మూడుసార్లు పోటీచేశారు. తాజాగా వీరిద్దరి భేటీ నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయనతోపాటు ఇదే జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కూడా వేటు వేశారు.

Tags:Politics of changing colors…
