పోలింగ్‌ దాదాపు 77 శాతానికి చేరుకుంది

Date:12/04/2019
గుంటూరు ముచ్చట్లు :
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు గంటల తరబడి క్యూలో నిరీక్షించి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ దాదాపు 77 శాతానికి చేరుకుంది. పెరిగిన పోలింగ్ తమకే అనుకూలమని అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. గత అయిదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని, అందువల్లే మరోసారి తమకు అధికారం ఇవ్వనున్నారని టీడీపీ అంటోంది. తమకు అండగా నిలవడానికే ఓటు వేయడానికి ముందుకు వచ్చారని టీడీపీ అంచనా వేస్తోంది. పసుపు-కుంకుమ వల్ల మహిళలు, పింఛన్‌‌తో వృద్ధులు, అన్నదాత సుఖీభవతో రైతులు సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. రాజధాని అమరావతిలో పురోభివృద్ధి, పోలవరం పనుల్లో పురోగతి లాంటివి తమకు సానుకూలంగా ఉంటాయని లెక్కలు వేసుకుంటోంది. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఈవీఎంల నిర్వహణలో ఎన్నికల సంఘం వైఫల్యం చెందినా ప్రజలు ఓపికగా నిలబడి ఓటేయడం తమకు లాభిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇక, వైసీపీ కూడా తామే అధికారంలోకి వస్తామని అంటోంది.
తన ఓటమి తప్పదని నిర్ధరణకు వచ్చిన చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను బెదిరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు రకరకాల కుయుక్తులు పన్ని అరాచకాలు సృష్టించినా పెద్ద సంఖ్యలో జనం ఓటింగ్‌లో పాల్గొన్నారని వైసీపీ వెంటన నడిచారనడానికి ఇదే రుజువని ఆ పార్టీ వ్యాఖ్యానిస్తోంది. గత ఐదేళ్ల పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు ఇప్పుడు నమోదైన పోలింగ్‌ శాతమే నిదర్శనమని వైకాపా భావిస్తోంది. ఓటింగ్‌ శాతం తగ్గేలా టీడీపీ ప్రయత్నించినా, చివరకు పోలింగ్‌ 80 శాతానికి చేరడం ఖచ్చితంగా తమకు లాభించే అంశమేనని ధీమాగా ఉంది. పాదయాత్రతో ప్రజలకు జగన్ చేరువ కావడం, ప్రత్యేకహోదా విషయంపై మొదటి నుంచీ ఒకే మాటపై ఉన్నారని వాదిస్తోంది.
Tags:Polling reached almost 77 per cent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *